పాకిస్థాన్ గడ్డపైకి అమెరికా దళాలు... ఇమ్రాన్ ప్రభుత్వం సానుకూలం...

ABN , First Publish Date - 2021-05-30T22:20:40+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ 2021 సెప్టెంబరుతో

పాకిస్థాన్ గడ్డపైకి అమెరికా దళాలు... ఇమ్రాన్ ప్రభుత్వం సానుకూలం...

ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ 2021 సెప్టెంబరుతో పూర్తికావలసి ఉంది. ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న తాలిబన్ ఉగ్రవాదులు పేట్రేగిపోకుండా చూడాలంటే ఈ ప్రాంతంలో తన దళాలను ఉంచాలని అమెరికా కోరుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్ మళ్ళీ ఓ ఉగ్రవాద కేంద్రంగా, అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారడాన్ని నిరోధించాలంటే ఈ ప్రాంతంలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరమని పెంటగాన్ ప్రకటించింది. సైనిక స్థావరాల కోసం పాకిస్థాన్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. అంతలోనే పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతి ఇచ్చేసింది. అమెరికాతో సరికొత్త భాగస్వామ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్థాన్ తహతహలాడుతున్నట్లు దీనినిబట్టి స్పష్టమవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. 


2021 సెప్టెంబరునాటికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిపోతే, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్‌పై వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి పాకిస్థాన్ గడ్డపై తన సేనలను మోహరించడం అమెరికాకు చాలా ముఖ్యమని విశ్లేషకులు చెప్తున్నారు. సైనిక స్థావరాలను ఇవ్వడం వల్ల ఆర్థిక సాయం, వ్యూహాత్మక ప్రయోజనాలు పొందడానికి పాకిస్థాన్‌కు అవకాశం కలుగుతుందని చెప్తున్నారు.


పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ మే 11న మీడియాతో మాట్లాడుతూ, తమ భూభాగంలో లేదా సైనిక స్థావరాల్లో విదేశీ సైన్యాన్ని అనుమతించేది లేదన్నారు. పాకిస్థాన్ ఫారిన్ ఆఫీస్ కూడా ఇదే వైఖరిని వెల్లడించింది. సైనిక స్థావరాలను అమెరికా సైన్యం ఉపయోగించుకోవడంపై కొత్తగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదని తెలిపింది. అదే సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం 2001లో అమెరికా, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందం కొనసాగుతున్నట్లు తెలిపింది. అమెరికా సైన్యానికి భూమిపైన, గగనతలంలో సహకరించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉన్నట్లు తెలిపింది. 


అమెరికాకు ఈ విధంగా సహకరించడం వల్ల 2004లో పాకిస్థాన్ బాగా లబ్ధి పొందింది. అమెరికాకు ప్రధాన నాన్-నాటో మిత్ర దేశంగా పాకిస్థాన్ ప్రయోజనాలు పొందింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అందజేసే సదుపాయాలను కూడా పొందగలిగింది. 1999 నుంచి 2008 వరకు ఐఎంఎఫ్, తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి దాదాపు 23 బిలియన్ డాలర్లను రుణాలు, గ్రాంట్ల రూపంలో పాకిస్థాన్ పొందింది. 


Updated Date - 2021-05-30T22:20:40+05:30 IST