‘మహా’ విషాదం: ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది!

ABN , First Publish Date - 2021-04-21T20:18:02+05:30 IST

కోవిడ్-19 విజృంభణతోపాటు ప్రాణవాయువు కొరత వేధిస్తున్న

‘మహా’ విషాదం: ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది!

నాసిక్ : కోవిడ్-19 విజృంభణతోపాటు ప్రాణవాయువు కొరత వేధిస్తున్న సమయంలో ఆక్సిజన్ లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సంఘటనలో దాదాపు  22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం జరిగింది. 


నాసిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ మంధరే తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన నేపథ్యంలో 22 మంది మరణించారు, వీరంతా కోవిడ్-19 వ్యాధిగ్రస్థులే. ఆక్సిజన్ లీక్ అయిన తర్వాత ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. 


ప్రమాదం జరిగిన వెంటనే మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగనే తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది. 


ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని డాక్టర్ షింగనే తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదన్నారు. 


మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మాట్లాడుతూ, నాసిక్‌లో ట్యాంకర్ వాల్వులు లీక్ అయినందువల్ల పెద్ద మొత్తంలో ఆక్సిజన్ లీక్ అయినట్లు తెలిపారు. దీని ప్రభావం ఆసుపత్రిపై కూడా ఉండే అవకాశం ఉందన్నారు. మరింత సమాచారం రావలసి ఉందన్నారు. 


మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం మరింత బాధాకరం. 




Updated Date - 2021-04-21T20:18:02+05:30 IST