న్యాయ వ్యవస్థ కృషితో రాజ్యాంగం మరింత బలోపేతం : మోదీ

ABN , First Publish Date - 2021-02-06T19:39:40+05:30 IST

మన దేశ న్యాయ వ్యవస్థ మన రాజ్యాంగాన్ని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా వివరిస్తోందని

న్యాయ వ్యవస్థ కృషితో రాజ్యాంగం మరింత బలోపేతం : మోదీ

న్యూఢిల్లీ : మన దేశ న్యాయ వ్యవస్థ మన రాజ్యాంగాన్ని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా వివరిస్తోందని, ఫలితంగా రాజ్యాంగం మరింత బలపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల హక్కులను కాపాడటమైనా, దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేయవలసిన పరిస్థితి ఏర్పడినపుడైనా తన కర్తవ్యాన్ని న్యాయ వ్యవస్థ నిర్వహిస్తోందని చెప్పారు. 


గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబిలీ ఉత్సవాల సందర్భంగా శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. మన రాజ్యాంగాన్ని రూఢిగా, నిశ్చయంగా, నిర్ద్వంద్వంగా, ఖండితంగా, సృజనాత్మకంగా న్యాయ వ్యవస్థ వివరిస్తోందని చెప్పారు. న్యాయ వ్యవస్థ ఈ విధంగా వివరించడం వల్ల మన రాజ్యాంగం మరింత బలపడుతోందని చెప్పారు. దేశ ప్రజల హక్కులను కాపాడటమైనా, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన పరిస్థితి ఉత్పన్నమైనపుడైనా, న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందన్నారు. గుజరాత్ హైకోర్టు సత్యం, న్యాయాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని  అభినందించారు. న్యాయపరమైన అవగాహన, పాండిత్యం, మేధాశక్తి వంటివాటితో గుజరాత్ హైకోర్టు, బార్ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించాయన్నారు. 


న్యాయం కోసం అంకితభావంతో, కర్తవ్యబద్ధతతో గుజరాత్ హైోర్టు పని చేస్తోందని, రాజ్యాంగ విధుల నిర్వహణకు నిరంతరం సంసిద్ధంగా ఉంటోందని, వీటి వల్ల మన దేశ న్యాయ వ్యవస్థతోపాటు ప్రజాస్వామ్యం బలపడుతోందని చెప్పారు. న్యాయ శాస్త్ర నియమాలకు కట్టుబడి ఉండాలనే దృక్పథం అనేక శతాబ్దాల నుంచి భారతీయ నాగరికతకు ప్రాతిపదిక అని పేర్కొన్నారు. సుపరిపాలన మూలాలు న్యాయాన్ని అందజేయడంలోనే ఉంటాయని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయన్నారు. ప్రపంచ స్థాయి న్యాయ వ్యవస్థను మన దేశంలో నిర్మించేందుకు బార్, జ్యుడిషియరీ కృషి చేయాలన్నారు. 


గుజరాత్ హైకోర్టును 1950 మే 1న ఏర్పాటు చేశారు. 




Updated Date - 2021-02-06T19:39:40+05:30 IST