రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్షలు డుమ్మా

ABN , First Publish Date - 2021-11-26T23:45:40+05:30 IST

ఒక పార్టీ ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. కానీ ఆ పార్టీ ఒక కుటుంబం కోసం మాత్రమే పని చేస్తుంది. ఆ పార్టీ అంటేనే కుటుంబం. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్దం. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏళ్ల తరబడి..

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్షలు డుమ్మా

న్యూఢిల్లీ: నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలు డుమ్మా కొట్టాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. కాగా, మరికొన్ని పార్టీలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా హాజరు కాలేదు. కాగా, ఈ సందర్భంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వారసత్వ రాజకీయాల్ని ఎండగట్టారు.


‘‘ఒక పార్టీ ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. కానీ ఆ పార్టీ ఒక కుటుంబం కోసం మాత్రమే పని చేస్తుంది. ఆ పార్టీ అంటేనే కుటుంబం. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్దం. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏళ్ల తరబడి ఒక కుటుంబమే ఆ పార్టీని ఏలుతున్నారు, ఈ దేశాన్ని కూడా అలాగే పాలించారు. ఇంత కంటే ఆ పార్టీ గురించి ఏం చెప్పాలి?’’ అని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు.


కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా దేశంలో అనేక పార్టీలు వారసత్వ రాజకీయాలకు పరిమితం అయిపోయాయని, కుటుంబాన్ని దాటి రాజకీయాలు చేయడం లేదని, పాలన కూడా అందించట్లేదని మోదీ దుయ్యబట్టారు. తరాలకు తరాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వారసులకు పార్టీల పగ్గాలు అప్పగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆ రోజుకు గుర్తుగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవరంగా నిర్వహించనున్నట్లు 2015లో మోదీ ప్రకటించారు.

Updated Date - 2021-11-26T23:45:40+05:30 IST