బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉంది: చిదంబరం

ABN , First Publish Date - 2021-12-27T01:28:05+05:30 IST

గోవాలో బీజేపీని ఓడించే సామర్థ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత..

బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉంది: చిదంబరం

న్యూఢిల్లీ: గోవాలో బీజేపీని ఓడించే సామర్థ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కేవలం బీజేపీయేతర ఓట్లను మాత్రమే చీల్చగలవని అన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా చిదంబరం ఉన్నారు.


ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేది రెండు అంశాల ప్రాతిపదికగా ఉంటుందని చిదంబరం తెలిపారు. పార్టీకి విధేయతగా ఉండటం, ప్రజల మనసులు గెలుచుకోవడం అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు వారు విధేయులుగా ఉండగలరన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.


పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెక్సో రెజినాల్డో ఎమ్మెల్యే పదవికి ఇటీవల రాజీనామా చేసి టీఎంసీలో చేరడంతో 40 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం రెండుకు పడిపోయింది. దీనిపై చిదంబరం మాట్లాడుతూ, ఇతర పార్టీల వ్యూహం కానీ, ఉద్దేశంపై కానీ తాను వ్యాఖ్యానించేది లేదని అన్నారు. అయితే గోవాలోని 40 నియోజకవర్గాల్లోనూ  కాంగ్రెస్ బలంగా వేళ్లూనుకుందని చెప్పారు. బీజేపీకి ధనబలం, అధికార దుర్వినియోగం బలం ఉన్నప్పటికీ ఆ పార్టీని ఓడించగలిగే సత్తా ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉందనే విషయం ప్రజలకు కూడా బాగా తెలుసునని అన్నారు. 99 శాతం కాంగ్రెస్ వర్కర్లు పార్టీతోనే ఉన్నారని, టీఎంసీలోకి రెజినాల్డో చేరడంపై తనకెంలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ఓడిపోయే అభ్యర్థిని మాత్రమే టీఎంసీ లాక్కుందని, ఎన్నికల్లో ఆయనను నిలబెడితే ఓటమినే చవిచూస్తారని చిదంబరం అన్నారు. బీజేపీకి బీ-టీమ్‌గా టీఎంసీ, బీజేపీ వ్యవహరించనున్నాయా అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. 2022 ఎన్నికల్లో పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యేనని, కాంగ్రెస్ స్పష్టమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.


సీఎం అభ్యర్థిపై..

ఎన్నికలకు ముందే మఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలపై చిదంబరం మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాత, వారితో సంప్రదించి, ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు.

Updated Date - 2021-12-27T01:28:05+05:30 IST