ఆరు రాష్ట్రాల్లోనే...

ABN , First Publish Date - 2021-05-02T07:46:50+05:30 IST

మూడో దశ వ్యాక్సినేషన్‌లో శనివారం 6 రాష్ట్రాల్లో 18-44 ఏళ్ల వయసువారు టీకా వేయించుకున్నారు. కొవిడ్‌ ఉధృతి కొనసాగుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌...

ఆరు రాష్ట్రాల్లోనే...

  • 18-44 వయసు వారికి టీకా షురూ
  • దిగ్గజ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా
  • వ్యాక్సిన్‌ కొరతపై రాష్ట్రాలు గగ్గోలు
  • రాష్ట్రాల వద్ద 79 లక్షల టీకాలున్నాయి
  • స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం


న్యూఢిల్లీ, మే 1: మూడో దశ వ్యాక్సినేషన్‌లో శనివారం 6 రాష్ట్రాల్లో 18-44 ఏళ్ల వయసువారు టీకా వేయించుకున్నారు. కొవిడ్‌ ఉధృతి కొనసాగుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాల్లో కొవిన్‌లో నమోదైన ఈ ఏజ్‌ గ్రూప్‌ వారికి పరిమిత సంఖ్యలో.. కొన్ని జిల్లాల్లోనే వ్యాక్సిన్‌ వేశారు. ‘‘మహారాష్ట్రకు శుక్రవారం 3 లక్షల కొవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. 18-44 ఏజ్‌ గ్రూప్‌ వారి కోసం 12 కోట్ల టీకాలు అవసరం’’ అని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అయితే.. టీకాల కొరత తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే చెబుతున్నారు. యూపీలో 7, రాజస్థాన్‌లో 3, గుజరాత్‌లో 10 జిల్లాల్లో ఈ ఏజ్‌ గ్రూప్‌ వారికి శనివారం టీకాలు వేశారు. ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌లో పరిమిత సంఖ్యలో వ్యాక్సినేషన్‌ కొనసాగించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం టీకాల కొరతతో ఈ వయసు వారికి వ్యాక్సినేషన్‌కు మరికొంత కాలం ఆగాల్సిందేనని చెబుతున్నాయి. తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు 2 రోజుల విరామం ఇచ్చారు. కాగా, అపోలో, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల శనివారం మూడోదశ వ్యాక్సినేషన్‌ను ప్రారంభమైంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ నత్తనడకన జరిగే అవకాశాలున్నాయి. గత నెలలో 9 కోట్ల మందికే టీకా ఇచ్చారు. ఈ నెలలో అంతకు మూడింతల టార్గెట్‌ ఉన్నా.. ఉత్పాదకతలో బాగా వెనకబడి ఉన్నాం. 


రాష్ట్రాల వద్ద 79 లక్షల డోసులు: కేంద్రం

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 79 లక్షలకుపైగా డోసుల టీకాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 3 రోజుల్లో మరో 17 లక్షల టీకాలను సరఫరా చేస్తామని పేర్కొంది. ‘‘ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 16.37 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశాం. ఏపీకి 5.26 కోట్ల డోసులు, తెలంగాణకు 3.75 కోట్ల టీకాలు ఇచ్చాం. ఈ వారంలో ఏపీకి 9 లక్షల డోసులు, తెలంగాణకు 8 లక్షల డోసులు ఇస్తాం’’ అని కేంద్రం తెలిపింది.


Updated Date - 2021-05-02T07:46:50+05:30 IST