అలనాటి బంగారు పక్షి, నేడు పేదరికంలో : మోదీ

ABN , First Publish Date - 2021-11-27T00:55:31+05:30 IST

భారత దేశం ఒకప్పుడు బంగారు పక్షిలా ఉండేదని,

అలనాటి బంగారు పక్షి, నేడు పేదరికంలో : మోదీ

న్యూఢిల్లీ : భారత దేశం ఒకప్పుడు బంగారు పక్షిలా ఉండేదని, నేడు పేదరికం, ఆకలి బాధ, వ్యాధులతో ఇబ్బందులు పడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందలాది సంవత్సరాలపాటు ఇతరుల పాలనలో ఉండటం వల్ల మన దేశం అనేక సమస్యల్లో చిక్కుకుందన్నారు. ఈ నేపథ్యంలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని వేళలా రాజ్యాంగం  దోహదపడుతోందని చెప్పారు. 


రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో  మోదీ మాట్లాడుతూ, మన దేశంతోపాటు స్వాతంత్ర్యం పొందిన ఇతర దేశాలను పరిశీలించినపుడు, ఆ దేశాలు మన కన్నా ఎంతో ముందంజలో ఉన్నాయన్నారు. దీనినిబట్టి మనం చేయవలసింది ఇంకా చాలా ఉందని అర్థమవుతుందని చెప్పారు. మనమంతా కలిసికట్టుగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 


స్వాతంత్ర్యం కోసం జీవించి, దాని కోసమే ప్రాణాలు త్యాగం చేసినవారి కలలను, మన దేశానికిగల వేలాది సంవత్సరాల సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని  రాజ్యాంగ రూపకర్తలు ఈ రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారని చెప్పారు. 


ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, వారి జీవితాలను సుఖమయం చేయడం రాజ్యాంగానికి ఇచ్చే నిజమైన గౌరవమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ, నేటికీ అనేక మంది ప్రజలు అనేక సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారన్నారు. కోట్లాది మందికి తమ ఇళ్లలో మరుగు దొడ్లు లేవన్నారు. విద్యుత్తు సదుపాయం లేకపోవడం వల్ల చీకట్లో జీవిస్తున్నారని చెప్పారు. మరికొందరికి సురక్షితమైన తాగునీరు లభించడం లేదన్నారు. 


Updated Date - 2021-11-27T00:55:31+05:30 IST