3 రోజుల్లో కేసులు రెట్టింపు

ABN , First Publish Date - 2021-12-19T07:44:42+05:30 IST

మైక్రాన్‌ ‘స్థానిక వ్యాప్తి’ ఉన్నచోట ఒకటిన్నర రోజు నుంచి మూడు రోజుల వ్యవధిలో కేసులు రెట్టింపు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ...

3 రోజుల్లో కేసులు రెట్టింపు

దేశంలో కేసులు 140

కర్ణాటకలోని విద్యా సంస్థల్లో 5 పాజిటివ్‌లు

మహారాష్ట్రలో బూస్టర్‌ పొందిన యువకుడికీ

ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌ యూనిట్లు

యూకేలో ఒక్కరోజే 10వేల ఒమైక్రాన్‌ కేసులు

కొత్త వేరియంట్‌తో మరో ఆరు మరణాలు

ఆగ్నేయాసియా.. అప్రమత్తం: డబ్ల్యూహెచ్‌వో


జెనీవా, న్యూయార్క్‌, డిసెంబరు 18: ఒమైక్రాన్‌ ‘స్థానిక వ్యాప్తి’ ఉన్నచోట ఒకటిన్నర రోజు నుంచి మూడు రోజుల వ్యవధిలో కేసులు రెట్టింపు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంది. దీనికి.. రోగ నిరోధకతను తప్పించుకునే సామర్థ్యమా? వేరియంట్‌ అధిక వ్యాప్తి రేటు కారణమా? అనే విషయంపై స్పష్టత లేదని వివరించింది. 89 దేశాలకు ఒమైక్రాన్‌ వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌వో శనివారం పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఒమైక్రాన్‌ కేసులు నమోదవడం పట్ల డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. మరింత వ్యాప్తి చెందకుండా ప్రజారోగ్య, కట్టడి చర్యలను పటిష్ఠం చేయాలని ఆగ్నేయాసియా డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సూచించారు. 


దేశంలో 140కి చేరిన ఒమైక్రాన్‌ కేసులు!

దేశంలో ఒమైక్రాన్‌ కేసులు శనివారం రాత్రికి 140కి పెరిగాయి. కొత్తగా 4 రాష్ట్రాల్లో 30 కేసులు వచ్చాయి. కర్ణాటకలో 6, కేరళలో 4, మహారాష్ట్రలో 3 నమోదయ్యాయి. కర్ణాటక పాజిటివ్‌లలో ఐదుగురు దక్షిణ కన్నడ జిల్లాల్లోని రెండు విద్యాసంస్థలకు చెందినవారు. వీరి ప్రయాణ చరిత్ర, అంతర్జాతీయ ప్రయాణికులతో ఏమైనా కాంటాక్టు అయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. కేరళలో ట్యునీషియా నుంచి ప్రైవేటు విమానంలో వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్‌ సోకింది.    అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి మహారాష్ట్ర చేరిన యువకుడి (29)కి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఇతడు ఫైజర్‌ టీకా బూస్టర్‌ డోసు కూడా పొందాడు. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ఢిల్లీలోని 3 ప్రయివేటు ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. యూకేలో  ఒక్క రోజులోనే 10 వేల ఒమైక్రాన్‌ కేసులు వచ్చాయి. మరో ఆరుగురు చనిపోయారు. శుక్రవారం వరకు మొత్తం ఒమైక్రాన్‌ కేసులు 14,900 ఉండగా.. శనివారం 25 వేలకు చేరాయి. 


టీకా సర్టిఫికెట్‌లో అమిత్‌ షా పేరు 

ఉత్తర్‌ప్రదేశ్‌ ఇటావా జిల్లాలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్లతో కొవిడ్‌ టీకా సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. సర్సైనావర్‌ సీహెచ్‌సీలో ఈ నెల 12న వీరంతా తొలి డోసు పొందినట్టు ఉంది. ఇవి నకిలీ సర్టిఫికెట్లని చెప్పిన అధికారులు.. విచారణకు ఆదేశించారు. డిసెంబరు 12న తమ ఐడీ హ్యాక్‌ అయిందని.. దానిని నిలిపివేయాలని ఉన్నతాధికారులను కోరామని సీహెచ్‌సీ ఇన్‌చార్జి చెప్పారు. 


బూస్టర్‌ డోసుగా ‘కోవోవ్యాక్స్‌’ 

కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తున్న  తరుణంలో ‘కొవిషీల్డ్‌’ కంటే ప్రభావవంతమైన బూస్టర్‌ డోసుగా కోవోవ్యాక్స్‌ పనికొస్తుందని భారత ప్రభుత్వ జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) సంస్థ ‘ఇన్సాకాగ్‌’ డైరెక్టర్‌ అనురాగ్‌ అగ్రవాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం త్వరపడటం మంచిదని సూచించారు.  దీన్ని తీసుకున్న వారికి ఆరోగ్య భద్రత చేకూరడంతో పాటు బలమైన రోగ నిరోధక స్పందన కలిగినట్లు అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. ఒమైక్రాన్‌పై ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టతకు రావాలంటే మరిన్ని  పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 


2024 దాకా కరోనా: ఫైజర్‌ 

కరోనా 2024 వరకు కొనసాగొచ్చని అమెరికా ఫార్మా కంపెనీ ‘ఫైజర్‌’ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ మైఖేల్‌ డోల్‌స్టెన్‌ వ్యాఖ్యానించారు. ప్రయోగ పరీక్షల్లో భాగంగా 2 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తమ టీకా రెండు డోసులను (ఒక్కో డోసు 3 మైక్రోగ్రామ్‌లు) అందించినా ఆశాజనక స్థాయిలో రోగ నిరోధక స్పందన రాలేదన్నారు. 2 నెలల విరామం తర్వాత మూడో డోసును కూడా పరీక్షించనున్నట్లు వెల్లడించారు. కాగా, 2022 మే నెలలో 12-15 ఏళ్లలోపు వారికి, అక్టోబరు చివరి వారంలో 5-11 ఏళ్లలోపు వారికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అత్యవసర  అనుమతులు మంజూరయ్యాయి. 


గల్ఫ్‌ మీదుగా 

భారత్‌కు ఒమైక్రాన్‌!

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఒమైక్రాన్‌ కేసులు క్రమేణా వెలుగులోకి వస్తుండగా.. వీరిలో ఎక్కువ శాతం గల్ఫ్‌ దేశాల మీదుగా   భారత దేశానికి వస్తున్నవారే ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని దేశాల నుంచి భారత్‌కు నేరుగా వచ్చే విమానాలు అంతంతమాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికులు గల్ఫ్‌ దేశాల్లోని ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌లో ప్రయాణిస్తూ భారత్‌కు వస్తున్నారు. తక్కువ ధరల కారణంగా.. యూఏఈలోని ఎమిరేట్స్‌, ఇత్తెహాద్‌, ఖతర్‌లోని ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానయాన సంస్ధల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, ముప్పు జాబితాలోని దేశాల నుంచి వస్తున్నవారికి భారత్‌లో విమానాశ్రయాల్లో కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్ధితిపై కన్నేసి ఉంచుతున్నారు. ఈ జాబితాలోని లేని గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం టెస్టులు కచ్చితం కాదు. ముప్పు జాబితాలో పేర్కొన్న దక్షిణాఫ్రికా, గల్ఫ్‌, యూరప్‌ దేశాల ప్రయాణికులంతా దుబాయ్‌, అబుధాబి లేదా దోహా నుంచి భారత్‌కు వస్తుంటారు. దుబాయ్‌, దోహాల నుంచి హైదరాబాద్‌కు సగటున నాలుగు నుంచి అయిదు గంటల ప్రయాణ వ్యవధి ఉంది. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముప్పు దేశాల నుంచి వచ్చేవారిని మాత్రమే పరీక్షిస్తూ, ఇతరులకు తక్కువగా పరీక్షలు చేస్తుండడం విధాన లోపాన్ని సూచిస్తోంది.

Updated Date - 2021-12-19T07:44:42+05:30 IST