ఒమిక్రాన్‌ వైరస్‌ తీవ్రతపై హై అలర్ట్‌

ABN , First Publish Date - 2021-11-28T18:59:07+05:30 IST

పలు దేశాల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో ధార్వాడ, బెంగళూరు, మైసూరులోని విద్యాసంస్థలలో కొవిడ్‌ కేసులు పెరగడంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అప్రమత్తమయ్యారు. శనివారం సాయంత్రం

ఒమిక్రాన్‌ వైరస్‌ తీవ్రతపై హై అలర్ట్‌

- ఆంక్షలు విధించాలని సీఎం ఆదేశం

- ఉన్నతాధికారులతో సమీక్ష 

- ఒమిక్రాన్‌ పట్ల భయం వద్దు: మంత్రి సుధాకర్‌  

- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ 


బెంగళూరు: పలు దేశాల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో ధార్వాడ, బెంగళూరు, మైసూరులోని విద్యాసంస్థలలో కొవిడ్‌ కేసులు పెరగడంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అప్రమత్తమయ్యారు. శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌తోపాటు మూడో విడత టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ధార్వాడలో 200 మందికి పైగా వైరస్‌ సోకగా బెంగళూరులో ఇంటర్నేషనల్‌ స్కూల్‌లోనూ మైసూరులో రెండు నర్సింగ్‌ కళాశాలల్లోనూ కేసులు నమోదు కావడంపై వెంటనే అప్రమత్తం కావాలని ఆదేశించారు. ఇదే సందర్భంలో బీబీఎంపీ, బెంగళూరు నగర, ధార్వాడ, దక్షిణకన్నడ, ఉడుపి, చామరాజనగర్‌, కొడగు, మైసూరు జిల్లాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు అశోక్‌, సీఎన్‌ అశ్వత్థనారాయణ, అధికారులు వందితాశర్మ, మంజునాథ్‌ ప్రసాద్‌, గౌరవ్‌గుప్త, తుషార్‌ గిరినాథ్‌, టీకే అనిల్‌కుమార్‌, రణదీ్‌ప పాల్గొన్నారు. వైరస్‌ నియంత్రణకు పలు తీర్మానాలు చేశారు.  కేరళ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలి. జాతీయ రహదారిపై పర్యవేక్షణ కొనసాగించాలి. కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేశారు. సరిహద్దు జిల్లాల్లో మూడు షిఫ్ట్‌ల పద్దతిన వైద్య, రెవెన్యూ, ఇతరశాఖల ఉద్యోగుల సేవలు కొనసాగించాలి. 16 రోజులుగా కేరళ నుంచి వచ్చిన విద్యార్థులకు మరోసారి ఆర్‌టీపీసీఆర్‌ చేయాలి. హాస్టళ్లలోని విద్యార్థులకు నెగటివ్‌ రిపోర్టు వచ్చినా... ఏడు రోజులకొకసారి పరీక్షలు నిర్వహించాలి. కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి టెస్టింగ్‌లు లేకుంటే  అనుమతించకూడదు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాలు, స్విమ్మింగ్‌పూల్‌, లైబ్రరీ, ఉద్యానవనాల ఉద్యోగులు తప్పనిసరిగా రెండు డోసులు టీకా వేయించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, మా ల్స్‌లో రెండు డోసులు పొందినవారు మాత్రమే పనిచేయాలి. మరింత అందుబాటులో టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలతోపాటు మరిన్ని ఆంక్షలు, పాజిటివ్‌ నిర్ధారణ అయితే ఆసుపత్రులలోనే చికిత్సలు నిర్వహించనున్నారు.


దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ 

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వైరస్‌ ప్రబలిన మేరకు బెంగళూరు మహానగర పాలికె, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇరువురికి కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. నవంబరు 1నుంచి ఇప్పటి వరకు బెంగళూరుకు సౌత్‌ ఆఫ్రికా నుంచి 94 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో ఇద్దరికి వైరస్‌ సోకింది. బొమ్మనహళ్లి పరిధిలో ఒకరిని క్వారంటైన్‌ చేయగా మరొకరిని ప్రైవేటు హోటల్‌లో క్వారంటైన్‌ చేశారు. అయితే వీరికి కొత్త వైరస్‌ సోకిన లక్షణాలు లేవని అయినా ఇద్దరిపైనా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 


ఒమిక్రాన్‌ పట్ల భయం వద్దు: మంత్రి సుధాకర్‌ 

ఒమిక్రాన్‌ వైరస్‌ పట్ల ప్రస్తుతానికి భయం అవసరం లేదని అయితే కొ విడ్‌ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. భారత్‌లో ఒమిక్రాన్‌ నమోదు కాలేదని కర్ణాటకలోనూ అటువంటి ప్రభావం తలెత్తలేదన్నారు. శనివారం ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా పలువురు అధికారులు, వైద్యనిపుణులు, టాస్క్‌ఫోర్స్‌ కమిటీలతోపాటు జిల్లా వైద్యాధికారులతో సమీక్షలు జరిపారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్యసంస్థ కరోనా కొత్త వేరియంట్‌ను ఒమిక్రాన్‌గా తెలిపిందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆ లక్షణాలు ఎవరికీ లేవన్నారు. అయినా బెంగళూరు, మంగళూరు విమానాశ్రయాలలో హై అలర్ట్‌ ప్రకటించామన్నారు. ప్రత్యేకించి కొన్ని దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే పరీక్షలు చేస్తామని, పాజిటివ్‌ నిర్ధారణ అయితే ప్రత్యేక ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నా వారం రోజుల క్వారంటైన్‌ పాటించేలా ఆదేశించామన్నారు. ఆర్‌టీపీసీఆర్‌లో నెగటివ్‌ వచ్చినా విదేశాల నుంచి వచ్చేవారు వారం రోజులపాటు ఇళ్లలోనే ఉండాలని, వారిపై నిఘా కొనసాగుతుందన్నారు. ఒమిక్రాన్‌ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనుందని అంతకుమించి ప్రజలు అప్రమత్తం కావాల్సిందేనన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, ప్రత్యేకించి రాష్ట్రంలో 45లక్షల మంది రెండోడోసు వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉందని వెంటనే అందుబాటులో ఉండేచోట పొందాలన్నారు. దేశంలో సరాసరి 42.43 శాతం వ్యాక్సినేషన్‌ కాగా రాష్ట్రంలో 90శాతం మంది మొదటిడోసు సాధ్యమైందని మిగిలిన పదిశాతం మంది వెంటనే పొందాలన్నారు. కాగా కొత్త వేరియంట్‌కు అవసరమైన మందులు సిద్ధం చేస్తామన్నారు. ఇందుకోసం రూ.38 కోట్లు జిల్లా వైద్యాధికారులకు విడుదల చేశామన్నారు. కొత్త వైరస్‌ పట్ల పరిశోధనలు సాగుతున్నాయన్నారు. 

Updated Date - 2021-11-28T18:59:07+05:30 IST