5వేల మంది విదేశీయులకు ‘ఒమైక్రాన్‌’ పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-07T14:05:02+05:30 IST

వారం రోజులుగా విదేశాల నుంచి ప్రత్యేకించి ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందిన దేశాల నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు కరోనా ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం

5వేల మంది విదేశీయులకు ‘ఒమైక్రాన్‌’ పరీక్షలు

- ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం 

- జీహెచ్‌లో ప్రత్యేక వార్డు ప్రారంభం


అడయార్‌(చెన్నై): వారం రోజులుగా విదేశాల నుంచి ప్రత్యేకించి ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందిన దేశాల నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు కరోనా ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. వీరిలో పది శాతం మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయని, అయితే వారికి ‘ఒమైక్రాన్‌’ సోకిందీ, లేనిదీ నిర్ధారించాల్సిన అవసరం వుందన్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ‘ఒమైక్రాన్‌’ బాధితులకు చికిత్స అందించటానికి ఏర్పాటైన ప్రత్యేక వార్డును ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌, మంత్రి పీకే శేఖర్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ 36 దేశాల్లో తీవ్రంగా వ్యాప్తి చెందిందని, రాష్ట్రంలో ఆ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాకుండా విదేశాల నుంచి విమానాల్లో, నౌకల్లో వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌ లక్షణాలు బయటపడితే వెంటనే అంబులెన్సుల్లో సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నట్టు చెప్పారు. గత వారం రోజుల వ్యవధిలో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై తదితర విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన 5249 మందికి కరోనా ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో సుమారు యాభైమందికి ఏ రకం వైరస్‌ సోకిందనే విషయాన్ని నిర్ధారించాల్సి వుందన్నారు. 


ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షా సమయం తగ్గింపు

స్థానిక మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టుల ఫలితాలు వెల్లడించే సమయాన్ని తగ్గించినట్టు మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఇప్పటివరకూ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు వెలువడేందుకు ఆరు నుంచి ఏడు గంటలు పట్టేదని, ప్రస్తుతం దానిని ఐదు నుంచి ఆరుగంటలకు తగ్గించామని, ఆలోగా ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఇదే విధంగా ర్యాపిడ్‌ టెస్టు ఫలితాలకు గంట పట్టేదని, ప్రస్తుతం దాని ఫలితాలను అరగంటలోగా వెల్లడిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పలు కౌంటర్ల ద్వారా అనుమతిస్తూ వారికి థర్మల్‌స్కాన్‌ త్వరగా జరిపి, కరోనా ముందస్తు వైద్యపరీక్షలను వేగవంతంగా చేయడానికి ఆరోగ్యశాఖ అధికారులు తగు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

Updated Date - 2021-12-07T14:05:02+05:30 IST