S1 Electric Scooter బుకింగ్స్ మరో నెల వాయిదా

ABN , First Publish Date - 2021-11-26T18:50:41+05:30 IST

ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ కోసం మరికొన్నాళ్ళు

S1 Electric Scooter బుకింగ్స్ మరో నెల వాయిదా

న్యూఢిల్లీ : ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదు. ఎంతో కాలం నుంచి ఊరిస్తున్న ఈ స్కూటర్ రెండోసారి ఆన్‌లైన్ బుకింగ్స్‌ను నవంబరు 1 నుంచి ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మొదట్లో ప్రకటించింది. ఆ తర్వాత దీనిని డిసెంబరు  16కు వాయిదా వేసింది. భావిత కొనుగోలుదారులకు తాజాగా పంపిన ఈ-మెయిల్స్‌లో ఈ స్కూటర్ బుకింగ్స్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా చిప్ కొరత ఉండటం వల్ల బుకింగ్స్‌ను ప్రారంభించడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. 


మరోవైపు S1, S1 Pro స్కూటర్ల డెలివరీ కూడా ఆలస్యమవుతుందని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రకటించింది. డిసెంబరు మూడో వారం నుంచి వీటి డెలివరీ ప్రారంభమవుతుందని తెలిపింది. అంతకుముందు ప్రకటించినదాని ప్రకారం ఈ స్కూటర్ల డెలివరీ అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రారంభమై ఉండవలసింది. బుకింగ్స్‌ను ప్రారంభించడం ఆలస్యమైనందువల్ల ప్రస్తుత కొనుగోలుదారులకు స్కూటర్లను అందజేయడంపై దృష్టి పెట్టినట్లు ఈ కంపెనీ పేర్కొంది.  1000 పట్టణాలు, నగరాల్లో టెస్ట్ రైడ్స్ నిర్వహించడంపై కూడా దృష్టి పెట్టింది. డిసెంబరు 15 నాటికి రూ.499 చెల్లించినవారు ఓలా S1 రివల్యూషనరీ స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేయవచ్చునని ఈ-మెయిల్ ద్వారా తెలిపింది. 


మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బుకింగ్స్ ప్రారంభ తేదీని ఈసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కచ్చితంగా చెప్పలేదు. గతంలో నవంబరు 1, డిసెంబరు 16 అని చెప్పిన సంగతి తెలిసిందే. అసలు ఈ కంపెనీ సెప్టెంబరు నుంచి రిజర్వేషన్లు ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైనపుడు కొనుగోలుదారులు రూ.20,000 చెల్లించి, రిజర్వేషన్ చేయించుకోవచ్చునని తెలిపింది. మొదట్లో రిజర్వు చేయించుకున్నవారికి స్కూటర్లను బట్వాడా చేయడంపై ప్రస్తుతం ఈ కంపెనీ దృష్టి సారించింది. 


ఓలా S1 ధర రూ.85,099 కాగా ఢిల్లీలో FAME II రాయితీల తర్వాత ఎక్స్ షోరూం ధర అన్ని పన్నులతో కలిపి రూ.1.10 లక్షలు అవుతుంది. 


Updated Date - 2021-11-26T18:50:41+05:30 IST