ఓపీఎస్ చుట్టూ గృహాల ఉచ్చు

ABN , First Publish Date - 2021-08-20T15:53:18+05:30 IST

అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఒ.పన్నీర్‌సెల్వం చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?.. గృహ నిర్మాణశాఖ మంత్రిగా వున్నప్పుడు ఆయన హయాంలో వందలాది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన

ఓపీఎస్ చుట్టూ గృహాల ఉచ్చు

- పులియాన్‌తోపులో నాణ్యత లేని ఇళ్ల నిర్మాణం

- పన్నీర్‌సెల్వంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

- ఎగ్మూరు ఎమ్మెల్యే పార్తీబన్‌

- నాణ్యతపై నివేదిక కోరాం

- అక్రమాలకు పాల్పడినవారిని వదలబోం

- అసెంబ్లీలో మంత్రి అన్బరసన్‌


చెన్నై: అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఒ.పన్నీర్‌సెల్వం చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?.. గృహ నిర్మాణశాఖ మంత్రిగా వున్నప్పుడు ఆయన హయాంలో వందలాది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గృహనిర్మాణంలో నెలకొన్న అక్రమాలు ఆయన్ని వెంటాడనున్నాయా?..అవుననే అంటున్నాయి ప్రభుత్వవర్గాలు. స్థానిక పులియాన్‌తోపులో పేదల కోసం కట్టించిన గృహాలు రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం, పట్టుకుంటేనే గోడలు పెచ్చులూడి వస్తుండడంతో అందులో నివాసముంటున్న వారు బిక్కుబిక్కుమంటున్నారు. ‘ఇంటి సంగతి దేవుడెరుగు, ప్రాణాలు దక్కితే చాలన్న’ చందంగా చాలామంది ఆయా గృహాలను వీడారు. మరికొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాటిల్లోనే నివశిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వుంది. భారీ వ్యయంతో కట్టించిన గృహాలు ఇంతలోనే అంత దీనస్థితికి ఎలా వెళ్లాయన్నదానిపై ఇప్పటికే ప్రాథమికంగా నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం.. పూర్తి వివరాలను అందించాలని మద్రాస్‌ ఐఐటీ, అన్నావర్శిటీకి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులను కోరింది. ఆ నివేదికలు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలోనూ గ్రామీణ పరిశ్రమలు, స్లమ్‌ క్లియరెన్స్‌బోర్డు మంత్రి టీఎం అన్బరసన్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేగాక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేశారు. 


ఓపీఎస్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి : ఎగ్మూరు ఎమ్మెల్యే

గురువారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఎగ్మూర్‌ డీఎంకే ఎమ్మెల్యే పార్తీపన్‌ మాట్లాడుతూ... స్థానిక పులియాన్‌తోపు కేబీ పార్క్‌ సమీపంలో గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మితమైన కొత్త క్వార్టర్స్‌లో అవినీతి జరిగిందని, నాణ్యత లేకుండా కట్టడంతో రెండేళ్లు కూడా కాకుండానే గోడలు పెచ్చులూడి వస్తున్నాయని ఆరోపించారు. గత 2018 జనవరి 19వ తేదీ 9 అంతస్తులు కలిగిన నాలుగు బ్లాక్‌లు గృహాల నిర్మాణం జరిగిందన్నారు. రూ.112.26 కోట్లతో ఒక క్వార్టర్‌, రూ.139.13 కోట్లతో 11 అంతస్తు క్వార్టర్స్‌ నిర్మాణాన్ని 2018 ఆగస్టు 10వ తేదీ ప్రారంభించారని తెలిపారు. ఈ క్వార్టర్స్‌ నిర్మాణం 2019లో ఒకటి, 2020లో మరొకటి పూర్తయ్యాయని, నిర్మాణాలు ఎంతవేగంగా జరిగాయో దీనిని బట్టి తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆ గోడల్ని తాకితేనే సిమెంటు రాలిపోతోందని, పెచ్చులూడిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలు పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గత పదేళ్ల అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలన్నింటిని కూడా పరిశీలించాలని కోరారు. నామక్కల్‌లో నిర్మించిన ఇలాంటి భవనాలు ప్రారంభానికి ముందే కూలాయని గుర్తు చేశారు. విల్లుపురం సమీపంలో నిర్మించిన డ్యాం నీటిలో కొట్టుకుపోయిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. పులియాన్‌తోపు గృహాల నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, సదరు కాంట్రాక్టర్‌ గత పదేళ్లలో చేపట్టిన గృహాలు, కార్యాలయాల నిర్మాణాను పరిశీలించాలని కోరారు. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో పెరంబూర్‌లో ‘మురసోలి మారన్‌’ ఫ్లై ఓవర్‌ను అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వం చేపట్టిందని, అనంతరం అధికారం చేపట్టిన అన్నాడీఎంకే, ఫ్లై ఓవర్‌ నిర్మాణం నాసిరకంగా వుందని ఆరోపిస్తూ అర్ధరాత్రి కలైంజర్‌ కరుణానిధిని అరెస్టు చేశారని గుర్తుచేశారు. అలాగే, పులియాన్‌తోపు నాసిరకపు గృహాల నిర్మాణంలో అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రిగా వున్న ఒ.పన్నీర్‌సెల్వంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు జోక్యం చేసుకుంటూ.. డీఎంకే హయాంలో నిర్మించిన ఆ ఫ్లై ఓవర్‌ నాణ్యమైనదేనని ఆ తరువాత విచారణలో తేలిందని గుర్తు చేశారు.


కఠిన చర్యలు తప్పవు : మంత్రి టీఎం అన్బరసన్‌

ఎగ్మూరు ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి టీఎం అన్బరసన్‌ సమాధానమిస్తూ.. పులియాన్‌తోపులో స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు నిర్మించిన గృహాలు నాసిరకంగా ఉన్నాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాల్లో నిజానిజాలు తెలుసుకోవాలని ఉత్తర్వులు జారీచేశానన్నారు. పులియాన్‌తోపులో అప్పటికే ఉన్న గృహాలు శిధిలావస్థకు చేరడంతో, 2016 అన్నాడీఎంకే ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి కొత్త గృహాల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. అనంతరం గత ఏడాది చెన్నై కార్పొరేషన్‌ విజ్ఞప్తి ఆ క్వార్టర్స్‌ కరోనా ప్రత్యేక చికిత్సా కేంద్రాలుగా మారాయన్నారు. తమకు ఇంకా గృహాలు కేటాయించలేదంటూ లబ్ధిదారులు చేసిన విజ్ఞప్తి మేరకు తాను, స్థానిక మంత్రి శేఖర్‌బాబు స్వయంగా వెళ్లి ఆ భవనాలను పరిశీలించామని, అప్పటికే తాగు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని, విద్యుత్‌ తీగలు ధ్వంసమై వుండడం గమనించామన్నారు. అనంతరం లబ్ధ్దిదారులు ఇళ్లలో చేరుతున్న సమయంలోనే గోడల నుంచి నీరు కారుతోందంటూ ఫిర్యాదులు వచ్చాయని, దీంతో మంత్రి శేఖర్‌బాబు, అధికారులు మళ్లీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారన్నారు. ఈ భవన నిర్మాణాల నాణ్యతపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే భారతీయ సాంకేతికమండలిని కోరామని, నివేదిక వచ్చాక ఏవైనా తప్పులుంటే కాంట్రాక్టర్‌తో పాటు ఇందుకు బాధ్యులైన అందరిపైనా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గత అన్నాడీఎంకే పాలనలో నిర్మించిన భవనాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఐఐటీ, అన్నా విశ్వవిద్యాలయ నిపుణుల కమిటీలను కోరామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన నాణ్యత లేని కట్టడాలు, భవనాలపై ఇటీవల సమీక్షించిన ముఖ్యమంత్రి, తప్పులకు పాల్పడిన వారిపై కఠినచర్యలు చేపట్టాలని ఆదేశించారని మంత్రి అన్బరసన్‌ గుర్తు చేశారు. 

Updated Date - 2021-08-20T15:53:18+05:30 IST