గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

ABN , First Publish Date - 2021-12-25T09:11:57+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పీయూష్‌ జైన్‌ అనే అత్తరు వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్ల నగదు దొరికింది. ...

గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

  కాన్పూర్‌ అత్తరు వ్యాపారి ఇంట్లో

  150 కోట్ల నగదు స్వాధీనం


కాన్పూర్‌, డిసెంబరు 24: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పీయూష్‌ జైన్‌ అనే అత్తరు వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్ల నగదు దొరికింది. పీయూష్‌ పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆదాయ పన్ను (ఐటీ), డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌  (డీజీజీఐ) అధికారులు సంయుక్తంగా ఆయన ఇంట్లో గురువారం సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. సోదాల సమయంలో కప్‌బోర్డుల్లోని షెల్ఫుల్లో నోట్ల కట్టలు భారీగా లభించాయి. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు ఉండడంతో నగదు లెక్కించడానికి అధికారులు కరెన్సీ యంత్రాన్ని తెప్పించారు. ఓ రోజంతా నగదు లెక్కించగా మొత్తం రూ.150 కోట్లు ఉన్నట్లు తేలిందని, ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కాన్పూర్‌లో అత్తరు వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ఇత్తర్‌వాలి గాలి అనే ప్రాంతంలో పీయూష్‌ వ్యాపారం చేస్తున్నారు.


సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. దాదాపు 40 కంపెనీల ద్వారా ఆయన వ్యాపారం చేస్తున్నట్లు కనుగొన్నామని ఐటీ అధికారులు తెలిపారు.వాటిద్వారా నకిలీ ఇన్‌వాయి్‌సలను సృష్టించి, పన్ను చెల్లింపులను పీయూష్‌ ఎగ్గొట్టినట్లు తేలిందని వారు పేర్కొన్నారు. గత నెలలో ‘సమాజ్‌వాదీ అత్తరు’ అనే బ్రాండ్‌ను ఆయన ప్రారంభించడం గమనార్హం. కాగా.. నిందితుడు అఖిలేశ్‌ సన్నిహితుడు కావడంతో బీజేపీ.. ఎస్పీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ‘‘ఇదీ ఎస్పీ అవినీతి వాసన. ఆ పార్టీకి అవినీతి కొత్త కాదు’’ అని ఫొటోలతో సహా ట్వీట్‌ చేసింది. 

Updated Date - 2021-12-25T09:11:57+05:30 IST