సాగు చట్టాల రద్దు ప్రసక్తే లేదు : రైతు సంఘాలతో కేంద్రం

ABN , First Publish Date - 2021-01-20T23:31:04+05:30 IST

కొత్త సాగు చట్టాలను సవరించేందుకు సిద్ధమేనని, అయితే వీటిని

సాగు చట్టాల రద్దు ప్రసక్తే లేదు : రైతు సంఘాలతో కేంద్రం

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలను సవరించేందుకు సిద్ధమేనని, అయితే వీటిని రద్దు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అవసరమనుకుంటే రైతులు వీటిపై సుప్రీంకోర్టులో అపీలు చేయవచ్చునని తెలిపింది. రైతులతో బుధవారం జరిగిన 10వ విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి పాల్గొన్నారు. 


రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు ఈ నెల 19న జరగవలసింది. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమవడంతో ఈ చర్చలను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కమిటీ ఈ నెల 21న రైతులతో సమావేశమవాలని నిర్ణయించింది. ఈ చట్టాలను రద్దు చేయవలసిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. 


రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం జరిగాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయబోమని, అవసరమైతే సవరణలకు సిద్ధమేనని ప్రభుత్వం తెలిపింది. రైతు సంఘాలు ఈ చట్టాలపై సుప్రీంకోర్టులో అపీలు చేయవచ్చునని పేర్కొంది. ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, తమకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్ఐఏ తమను వేధిస్తోందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఈ విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపింది.


ఈ చర్చలకు ముందు నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాల గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తవహించవలసిన బాధ్యత రైతు సంఘాలకు కూడా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవాలనాడు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని వారు పునఃపరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


ఈ ట్రాక్టర్ ర్యాలీని ఆపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఢిల్లీలో నిరసనలు తెలిపేందుకు అనుమతులివ్వడమనేది శాంతిభద్రతలకు సంబంధించిన విషయమని తెలిపింది. దీనిని చూసుకోవలసినది పోలీసులేనని, కోర్టు కాదని పేర్కొంది.Updated Date - 2021-01-20T23:31:04+05:30 IST