ఇకపై.. విద్యుత్ కోతలుండవు
ABN , First Publish Date - 2021-06-30T13:29:13+05:30 IST
రాష్ట్రంలో ఇకపై విద్యుత్ కోత విధించే ప్రసక్తేలేదని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ వెల్లడించారు. స్థానిక కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి గ్రంథాలయం హాలులో మంగళ వారం ఉదయం విద్యుత్ వినియోగం,
- మంత్రి సెంథిల్ బాలాజీ
చెన్నై: రాష్ట్రంలో ఇకపై విద్యుత్ కోత విధించే ప్రసక్తేలేదని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ వెల్లడించారు. స్థానిక కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి గ్రంథాలయం హాలులో మంగళ వారం ఉదయం విద్యుత్ వినియోగం, మరమ్మతలపై విద్యుత్‌శాఖ అధి కారులు, విద్యుత్ బోర్డు ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2006-11 డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించి పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పథకాలను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పదేళ్లకు గాను అవసరమైన విద్యుదుత్పత్తికి అనువుగా ఈ పథకాలను అమలు చేస్తామన్నారు. గత అన్నాడీఎంకే పాల కులు విద్యుత్ మిగులు రాష్ట్రమంటూ ప్రగల్భాలు పలికారని, వాస్తవానికి రాష్ట్రమంతటా లక్షల సంఖ్యలో విద్యుత్ కనెక్షన్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. డీఎంకే పాలనలో అర్హులైనవారందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడమే ప్రధాన లక్ష్యమని, అందరికీ విద్యుత్ సరఫరా చేసిన తరువాత కూడా విద్యుత్ ఉత్పత్తిని అధికం చేసిన మీదటే రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా ప్రకటిస్తా మని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ కోసం 2.40 లక్షల మంది రైతులు దరఖాస్తులు సమర్పించి యేళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులతోపాటు అందరికీ విద్యుత్‌ను సకాలంలో అందించటమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 19న ప్రారంభమైన విద్యుత్ మరమ్మతు పనులన్నీ పూర్తయ్యాయని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోత ఉండదని, నెలవారీ మరమ్మతులకు మాత్రమే తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, విద్యుత్ బోర్డు చైర్మన్ రాజేష్ లఖానీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.