నేపాల్ సార్వభౌమాధికారంపై రాజీపడేది లేదు : కేపీ శర్మ ఓలీ

ABN , First Publish Date - 2021-01-12T22:59:24+05:30 IST

భారత్, చైనా, నేపాల్ సమాన సార్వభౌమాధికారంగల దేశాలని, ఈ విషయంలో నేపాల్

నేపాల్ సార్వభౌమాధికారంపై రాజీపడేది లేదు : కేపీ శర్మ ఓలీ

ఖాట్మండు : భారత్, చైనా, నేపాల్ సమాన సార్వభౌమాధికారంగల దేశాలని, ఈ విషయంలో నేపాల్ రాజీపడబోదని ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ చెప్పారు. లింపియధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు నేపాల్ భూభాగంలోనివని, ఇవి నేపాల్‌లో అత్యంత పవిత్రమైన భాగాలని పేర్కొన్నారు. ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ చానల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.  


భారత దేశానికి చెందిన లింపియధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ ప్రభుత్వం గత ఏడాది ఆ దేశ మ్యాపును మార్చిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా మ్యాపును మార్చడం సరికాదని భారత దేశం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గియావలి ఈ నెల 14న భారత దేశ పర్యటనకు వస్తున్నారు. ఈ వివాదాస్పద మ్యాపుతోపాటు ఇతర అంశాలను కూడా భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో చర్చిస్తారు. 


ఈ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ, నేపాల్ సార్వభౌమాధికార సమానత్వం విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. లింపియధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు నేపాల్‌లో పవిత్ర ప్రాంతాలని తెలిపారు. తాము భారత దేశానికి లేదా చైనాకు చెందిన భూభాగాన్ని కోరే స్థాయిలో లేమని, అయితే తమ మిత్రుల వద్ద ఉన్న తమ భూభాగాన్ని తప్పనిసరిగా కోరుతామని చెప్పారు. భారత్, చైనా మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించడంలో తాము ఉపయోగపడగలిగితే, తాము అందుకు సిద్ధమేనని చెప్పారు. భారత్-నేపాల్ మధ్య ఎటువంటి సమస్యలు లేని సంవత్సరంగా 2021 ఉంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఓలీ ఆదివారం మాట్లాడుతూ, విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గియావలి భారత్ పర్యటనలో సరిహద్దు వివాదంపైనే దృష్టి సారిస్తారన్నారు. 


Updated Date - 2021-01-12T22:59:24+05:30 IST