కరోనా టీకాతో కోటీశ్వరులయ్యారు

ABN , First Publish Date - 2021-05-21T00:43:50+05:30 IST

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి దారుణ పరిస్థితుల్లో..

కరోనా టీకాతో కోటీశ్వరులయ్యారు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి దారుణ పరిస్థితుల్లో కూరుకుపోతున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా మహ్మమారిని నిరోధించేందుకు వివిధ దేశాల్లోని ఫార్మా సంస్థలు శాస్త్రవేత్తలతో చేతులు కలిపాయి. ముమ్మర పరిశోధనలు చేసి కరోనా వ్యాక్సిన్లను తయారుచేశాయి. ఈ వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తానికి ఇంకా చేరకముందే సదరు ఫార్మా సంస్థలకు లాభాల పంట పండుతోంది. ఆయా ఫార్మా సంస్థల యజమానులు బిలియనీర్లుగా మారుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల పుణ్యమా అని 9 మంది బిలియనీర్లుగా మారారు.


దీ పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ లాభాల కారణంగా కొత్తగా 9 మంది అపరకుబేరుల జాబితాలో చేరారు. ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌ ఆధారంగా ఈ 9 మంది మొత్తం నికర సంపద 19.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక, ఇప్పటికే బిలియనీర్ల లిస్ట్‌లో ఉన్న మరో 8 మంది సంపద 32.2 బిలియన్‌ డాలర్లు మేర లాభాలు గడించారు. కొత్తగా చేరిన కుబేరుల్లో మోడెర్నా సంస్థ సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌, బయోఎన్‌టెక్‌ వ్యవస్థాపకుడు ఉగర్‌ సహిన్‌ టాప్‌లో ఉన్నారు. చైనా వ్యాక్సిన్‌ కంపెనీ కాన్‌సినో బయోలాజిక్స్‌‌కు చెందిన ముగ్గురు కో ఫౌండర్స్ కూడా ఈ బిలియనీర్ల జాబితాలో చేరినట్లు ఫోర్బ్స్ లిస్ట్ ద్వారా తెలుస్తోంది.


దీనిపై స్పందించిన పీపుల్స్ వ్యాక్సిన్ సంస్థ దేశంలో వ్యాక్సిన్ సంస్థల ఏకఛత్రాధిపత్యానికి ఇదే నిదర్శనమని, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. దానివల్ల వీరంతా బిలియనీర్లుగా మారడం దారుణమని పేర్కొంది. ఇప్పటికైనా వ్యాక్సిన్‌ టెక్నాలజీపై దిగ్గజ కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని ఆపాలని పిలుపునిస్తోంది. కాగా.. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి సంస్థలకు పేటెంట్ హక్కులను తాత్కారికంగా రద్దు చేయాలంటూ అనేక దేశాలు అభ్యర్థిస్తున్నాయి. భారత్ కూడా ఈ మేరకు అభ్యర్థించిన దేశాల్లో ఉంది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వామ్యం కాగలుగుతాయనేది ఆయా దేశాల్లోని నిపుణుల అభిప్రాయం.

Updated Date - 2021-05-21T00:43:50+05:30 IST