ఇళ్లలోనే ‘కొత్త సంవత్సర వేడుకలు’
ABN , First Publish Date - 2021-12-31T13:56:15+05:30 IST
ఒమైక్రాన్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న తరుణంలో పోలీసులు మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సంవత్సర మురిపెంలో ప్రజలు ఆదమరిచి వ్యవహరించరాదని అప్రమత్తం చేశారు. అంతేగాక నూతన వర్ష వేడుకలను అడ్డుకునేందుకు గాను

- ఉల్లంఘిస్తే కఠినచర్యలు
- పోలీసుల హెచ్చరిక
- భద్రతా విధుల్లో 1.25 లక్షల మంది
చెన్నై: ఒమైక్రాన్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న తరుణంలో పోలీసులు మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సంవత్సర మురిపెంలో ప్రజలు ఆదమరిచి వ్యవహరించరాదని అప్రమత్తం చేశారు. అంతేగాక నూతన వర్ష వేడుకలను అడ్డుకునేందుకు గాను శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అత్యవసర వాహనాలు తప్ప మిగిలిన వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. నిబంధనలు కఠినంగా అమలుచేసేలా రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది పోలీసులు భద్రతా విధులకు నియమితులయ్యారు. గత రెండేళ్లుగా కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ నిషేధాజ్ఞలతో ప్రజలు తమ తమ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్నారు. కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో న్యూ ఇయర్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనేందుకు ప్రజల ఎదురుచూస్తున్నారు. అయితే ఒమైక్రాన్ విజృంభణతో ఈ ఏడాది సముద్రతీరాల్లో నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేగాక హోటళ్లు, వాణిజ్య కూడళ్లలోనూ ఈ వేడుకలను నిషేధించింది.
నూతన సంవత్సర వేడుకల నిషేధాన్ని సక్రమంగా అమలుచేసేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. బీచ్ ప్రాంతాల్లో సముద్రతీరప్రాంతాల్లో ప్రజలు చేరకుండా సముద్రతీర భద్రతా దళాలతో కలసి స్థానిక పోలీసులు గస్తీ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొననున్నారు.
నగరంలో 18 వేల మంది పోలీసులు
నూతన సంవత్సరం వేడుకలను యువతీయువకులు మెరీనా తీరంలో గుమిగూడి కేక్ కట్ చేసి జరుపుకుంటుంటారు. ఈ ఏడాది విధించిన నిషేధంతో బీచ్‌లకు వెళ్లే రోడ్లలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించకుండా చర్యలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ఉత్తర్వులతో, అన్నాసాలై, కామరాజర్ రోడ్డు, రాజాజీ రోడ్లు, ఈసీఆర్, ఓఎంఆర్ రోడ్డు, వడపళని 100 అడుగుల రోడ్డు, తిరువొత్తియూర్ హైరోడ్డు, పూందమల్లి హైరోడ్డు సహా ప్రధాన రహదారుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా సుమారు 18 వేల మంది పోలీసులు భద్రతావిధుల్లో పాల్గొననున్నారు. అర్ధరాత్రి 12 గంటల్లోపు ప్రజలు తమ పనులు పూర్తిచేసుకొని ఇళ్లకు చేరుకోవాలని, తెల్లవారుజామున 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి బయట సంచరించే వారిపై కేసులు నమోదుచేయడంతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.