చర్చలతోనే కొత్త ఐటీ రూల్స్‌

ABN , First Publish Date - 2021-06-21T10:30:45+05:30 IST

పౌర సమాజంతో, ఇతర భాగస్వాములతో 2018లో విస్తృత సంప్రదింపుల తర్వాతే.. సోషల్‌ మీడియాకు సంబంధించి కొత్త నియమావళికి తుదిరూపునిచ్చినట్టు ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్‌ స్పష్టం చేసింది.

చర్చలతోనే కొత్త ఐటీ రూల్స్‌

వ్యక్తిగత గోప్యత హక్కును మా దేశం గౌరవిస్తుంది

ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్‌ 


న్యూఢిల్లీ, జూన్‌ 20: పౌర సమాజంతో, ఇతర భాగస్వాములతో 2018లో విస్తృత సంప్రదింపుల తర్వాతే.. సోషల్‌ మీడియాకు సంబంధించి కొత్త నియమావళికి తుదిరూపునిచ్చినట్టు ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్‌ స్పష్టం చేసింది. భారతదేశం రూపొందించిన కొత్త ఐటీ నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు అనుగుణంగా లేవని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌-హెచ్‌ఆర్‌సీ)లోని స్పెషల్‌ ప్రొసీజర్స్‌ బ్రాంచ్‌ జూన్‌ 11న భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త నిబంధనలను ఖరారుచేయడానికి ముందు.. అవి అంతర్జాతీయ చట్టాలకు, ముఖ్యంగా ఐసీసీపీఆర్‌లోని (పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక) 17, 19 అధికరణలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అనే అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చలు జరపడం తప్పనిసరి అని తాము భావిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఆ లేఖకు యూఎన్‌లోని భారత శాశ్వత మిషన్‌ సవివరమైన సమాధానమిచ్చింది.


భారతదేశంలోని సాధారణ సోషల్‌ మీడియా వినియోగదారుల సాధికారత కోసమే కొత్త నిబంధనలను రూపొందించామని పేర్కొంది. సామాజిక మాధ్యమ వేదికలపై దుర్భాషలను ఎదుర్కొన్న బాధితుల సమస్యలను పరిష్కరించే వ్యవస్థ ఉండాలన్నదే తమ ఉద్దేశమని తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం ఇటీవల ఎక్కువైందని.. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల రూపకల్పన తప్పనిసరి అయిందని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనల వల్ల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతమనే ఆందోళనలు తప్పని పేర్కొంది. కేఎస్‌ పుట్టుసామి కేసులో సుప్రీం కోర్టు పేర్కొన్నట్టు.. వ్యక్తిగత గోప్యత హక్కును భారతదేశం పూర్తిస్థాయిలో గుర్తించి, గౌరవిస్తుందని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-06-21T10:30:45+05:30 IST