స్వామి వివేకానంద స్ఫూర్తితోనే నూతన విద్యా విధానం : మోదీ

ABN , First Publish Date - 2021-01-13T01:17:41+05:30 IST

నూతన విద్యా విధానం దేశ నిర్మాణం వైపు ఓ ముందడుగు అని, స్వామి

స్వామి వివేకానంద స్ఫూర్తితోనే నూతన విద్యా విధానం : మోదీ

న్యూఢిల్లీ : నూతన విద్యా విధానం దేశ నిర్మాణం వైపు ఓ ముందడుగు అని, స్వామి వివేకానంద తాత్త్విక చింతన ప్రేరణతోనే దీనిని రూపొందించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మంగళవారం జరిగిన ద్వితీయ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మోదీ మాట్లాడుతూ, తన ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం గురించి వివరించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజనోత్సవాలు జరిగాయి.


బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మన దేశంలో యువతకు మెరుగైన అవకాశాలు లభించే వాతావరణాన్ని తీర్చిదిద్దుతోందని మోదీ చెప్పారు. స్వామి వివేకానంద ఎల్లప్పుడూ శారీరక, మానసిక వికాసంపైనే దృష్టి పెట్టేవారన్నారు. వ్యక్తికి ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉండాలని చెప్పేవారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా మువ్‌మెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలకు ప్రేరణ స్వామి వివేకానంద తాత్త్విక చింతనేనని చెప్పారు. నూతన విద్యా విధానం వ్యక్తిగత వికాసంపై దృష్టి పెడుతుందన్నారు. కోర్స్ స్ట్రక్చర్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నారు. ఓ తెలివైన వ్యక్తి మంచి కంపెనీని ఏర్పాటు చేస్తారని, అది అద్భుతమైన ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేస్తుందని అన్నారు. ఈ జీవావరణ వ్యవస్థ చాలా మంది మేధావులను సృష్టిస్తుందని, వారు మరిన్ని మంచి కంపెనీలను ఏర్పాటు చేస్తారని అన్నారు. దేశంలో అటువంటి జీవావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల మాదిరిగానే అటువంటి అవకాశాలను యువతకు అందజేస్తుందని అన్నారు. 


Updated Date - 2021-01-13T01:17:41+05:30 IST