నిర్లక్ష్యం చేస్తే.. మరోసారి లాక్‌డౌన్
ABN , First Publish Date - 2021-07-08T16:00:09+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు తొలగించామని, నిర్లక్ష్యం చేస్తే మరోసారి లాక్‌డౌన్ తప్పదని ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు. బుధవారం దొడ్డబళ్లాపుర ఆసుప

- హెచ్చరించిన ముఖ్యమంత్రి
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు తొలగించామని, నిర్లక్ష్యం చేస్తే మరోసారి లాక్‌డౌన్ తప్పదని ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు. బుధవారం దొడ్డబళ్లాపుర ఆసుపత్రి ప్రాంగణంలో 70 పడకల సామర్థ్యంతో మేక్ షిఫ్ట్ ఆసుపత్రిని ఆయన లాంచనంగా ప్రారంభించారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలలో మేక్ షిఫ్ట్ ఆసుపత్రులు నిర్మించారన్నారు. దొడ్డబళ్లాపురలో రూ.4 కోట్లతో ఆసుపత్రిని నిర్మించారన్నారు. కొవిడ్ మూడోవిడత ప్రబలితే రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొగలదనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు విడతలను ప్రజల సహకారంతో ఎదుర్కోగలిగామన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేసి 15 రోజులపాటు వెసులుబాటు ఇచ్చామన్నారు. ప్రజలు మాస్కు ధరించడం, శానిటైజర్ వాడకం, భౌతికదూరం వంటి వాటిని అలవాటు చేసుకోకుంటే మరోసారి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేస్తే అత్యవసరం ఏర్పడుతుందని అప్పుడు లాక్‌డౌన్ అనివార్యం కానుందన్నారు. కొవిడ్ నియంత్రణకు సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలో వైద్య సౌలభ్యాలు పెంచామన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో కొవిడ్ కేసులు అధికంగా కొనసాగినప్పుడు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది గ్రామాలవారీగా తిరిగి ప్రజలను చైతన్యం చేశారన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎంటీబీ నాగరాజ్, రెవెన్యూశాఖ మంత్రి అశోక్, ఎమ్మెల్యే వెంకటరామయ్య, నిసర్గ నారాయణస్వామి, బీడీఏ చైర్మన్ ఎస్‌ఆర్ విశ్వనాథ్, దిబ్బూరు జయణ్ణతోపాటు పలువురు పాల్గొన్నారు.