నిర్లక్ష్యం.. మరింత ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-22T06:50:16+05:30 IST

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రజల విశృంఖలత్వమే కారణమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు.

నిర్లక్ష్యం.. మరింత ప్రమాదం

కొవిడ్‌ నియమాలను గాలికొదిలేస్తున్నారు..

అందుకే దేశంలో కేసులు పెరుగుతున్నాయ్‌

8 కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌


న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రజల విశృంఖలత్వమే కారణమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. కొవిడ్‌ నియమాలను పాటించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ‘‘టీకాలు అందుబాటులోకి రావడంతో ప్ర జలు ఇక మాస్కులు పెట్టుకోనక్కర్లేదని భావిస్తున్నా రు. కొందరు వాటిని మెడకు తగిలిస్తున్నారు. మరికొందరు జేబులో పెట్టేస్తున్నారు. ఇంకొందరైతే అసలు వాడడమే లేదు’’ అని మంత్రి చెప్పారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా సూచించారు.


కాగా, ఆదివారం ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా 43,846 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,09,087కు చేరింది. మొత్తం పాజిటివ్‌ల్లో ఇది 2.66 శాతమని ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 95.96కు పడిపోయింది. వైర్‌సతో చికిత్స పొందుతూ 197 మంది మరణించారు. ఇంత మంది చనిపోవడం 97 రోజుల తర్వాత ఇదే తొలిసారి. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 27,126 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 2578, కేరళలో 2078 పాజిటివ్‌లు వచ్చాయి.


దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.4 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ అంత ప్రమాదకరమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. మార్చి 20 నాటికి 23.35 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎయిమ్స్‌లో చేరారు. ఉత్తరాఖండ్‌లో రోజుకు 10-20 మంది స్థానికులు, అంతే మొత్తంలో యాత్రికులకు పాజిటివ్‌గా తేలుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కుంభమేళా నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్‌ సర్కారుకు సూచించింది.


కాగా, మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో నలుగురు కరోనా పాజిటివ్‌ వ్యక్తులు వైద్యుల పర్యవేక్షణలో మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎంపీపీఎస్సీ) పరీక్ష రాశారు. ఇక, కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త ‘సంకల్ప్‌ అభియాన్‌’కు శ్రీకారం చుట్టింది. 23 నుంచి ప్రతి రోజూ రెండు సార్లు సైరన్‌ మోగి.. ప్రజలకు కొవిడ్‌ నిబంధనలను గుర్తు చేస్తుంది. వెంటనే ప్రజలంతా ఎక్కడి వారక్కడే ఆగిపోయి.. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. ‘‘ఇప్పటివరకూ 76 దేశాలకు 6 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్లను పంపాం. దేశ ప్రజలకు 4.5 కోట్ల డోసుల టీకాలు వేశాం.’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. 




పిల్లల్లో స్థూలకాయం

తమ పిల్లల ఆరోగ్యం పరంగా తల్లిదండ్రులకు ఇది ఆందోళన కలిగించే వార్తే. కరోనా ప్రభావంతో పిల్లల్లో స్థూలకాయ సమస్య నెలకొనే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ కారణం గా ఇంటి పట్టునే ఉంటుండటంతో చాలామంది ఆటపాటల కు దూరం అవుతున్నారని, అదేపనిగా కంప్యూటర్‌ వద్ద కూ ర్చుంటున్నారని, దీంతో శారీరక శ్రమకు దూరమవుతున్నారని చెబుతున్నారు. ఇంట్లో కట్టిపడేసినట్లు ఉండిపోయి సామాజిక జీ వనానికి దూరమవుతున్నారని, జంక్‌ఫుడ్‌ తీసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. 


Updated Date - 2021-03-22T06:50:16+05:30 IST