‘నీట్’కు మినహాయింపు ఇవ్వండి
ABN , First Publish Date - 2021-12-30T14:59:03+05:30 IST
ప్యారీస్(చెన్నై): వైద్యవిద్యాకోర్సులకు సంబంధించి జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష ఎంపీలు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.

- అమిత్‌షాకు రాష్ట్ర ఎంపీల వినతి
ప్యారీస్(చెన్నై): వైద్యవిద్యాకోర్సులకు సంబంధించి జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష ఎంపీలు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వైద్య విద్యా కోర్సుల్లో చేరడానికి సులభతరంగా నీట్ ప్రవేశపరీక్షలను రద్దు చేయాలని రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సహా తమిళ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే కోరికతో గత నెల రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని సంప్రదించిన ముఖ్యమంత్రి స్టాలిన్ నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించి, రాష్ట్రపతి దృష్టికి పంపించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో శీతాకాలపు పార్లమెంటు ఉభయసభల్లో సైతం నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ఇదిలా వుండగా, మంగళవారం ఢిల్లీలో డీఎంకే పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు టీఆర్ బాలు నేతృత్వంలో అఖిలపక్షాల ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని గుర్తుచేశారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, డీపీఐ, ఎండీఎంకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల ఎంపీలు కలుసుకొని, నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమిత్‌షాను కలుసుకున్న ఎంపీలలో డీఎంకే తరఫున టీఆర్ బాలు, అన్నాడీఎంకే తరఫున నవనీతకృష్ణన్, కాంగ్రెస్ తరఫున జయకుమార్, డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్, ఉభయ కమ్యూనిస్టుల తరఫున వెంకటేశన్, సెల్వరాజ్, ఐయూఎంఎల్ ఎంపీ నవాజ్ ఘనీ తదితరులున్నారు.
ఆ తీర్మానం పరిశీలిస్తున్నాం: రాజ్‌భవన్ వెల్లడి
‘నీట్’ పరీక్ష మినహాయింపుపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పరిశీలిస్తున్నట్టు రాజ్‌భవన్ ప్రకటించింది. రాష్ట్రానికి ‘నీట్’ జాతీయస్థాయి పరీక్ష నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలంటూ గత సెప్టెంబరు 13వ తేదీ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ఆ తీర్మానాన్ని నాటి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదించలేదు. అప్పటినుంచి అది పెండింగ్‌లోనే వుండిపోయింది. కాగా, ‘నీట్’ మినహాయింపు తీర్మానంపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు, తీర్మానం గవర్నర్ పరిశీనలో ఉందని రాజ్‌భవన్ తెలియజేసింది.