నీట్... ఏటా రెండుసార్లు?
ABN , First Publish Date - 2021-11-26T08:42:35+05:30 IST
మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే నీట్ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే అంశంపై కేంద్రంలో మళ్లీ చర్చలు జరగనున్నాయి.

పరిశీలించనున్న కేంద్రం
న్యూఢిల్లీ, నవంబరు 25: మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే నీట్ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే అంశంపై కేంద్రంలో మళ్లీ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించనున్నాయి. రమేశ్ పోఖ్రియాల్ విద్యామంత్రిగా ఉన్న సమయంలో ఈ మేరకు చర్చలు ప్రారంభించారు. ఈ విషయంపై విద్యాశాఖ సానుకూలంగా ఉన్నట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఆయా శాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈలోగా కేంద్రంలో మంత్రిత్వ శాఖలు మారాయి. వైద్య వైద్యను నియంత్రించడానికి కొత్తగా నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. మరోవైపు... నీట్ పరీక్షను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కేవలం ఒక్కరోజు, ఒక్కసారి నిర్వహించే పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థుల అవకాశాలను నిర్ణయించడం సరికాదనే అభిప్రాయం ఉంది. పరీక్ష సరిగా రాయలేదనో, మంచి ర్యాంకు రాలేదనో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ... సామాజిక, ఆర్థిక రంగాలపై నీట్ ప్రభావాన్ని అధ్యయనం చేసింది. కోచింగ్ సంస్కృతి బాగా పెరిగిందని, కేవలం ధనిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకే శిక్షణ అందుబాటులో ఉందని కమిటీ పేర్కొంది. నీట్‌ను మరిన్నిసార్లు నిర్వహించడం ద్వారా వైద్య విద్యను మరింతమందికి అందుబాటులోకి తీసుకురావచ్చనే అభిప్రాయం కూడా ఉంది.