ఆవుపేడతో రేడియేషన్ నుంచి రక్షణ?
ABN , First Publish Date - 2021-02-22T07:27:03+05:30 IST
ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి రక్షణ కల్పించే శక్తి ఆవుపేడకు ఉందా? భారత్, రష్యాల్లోని అణుకేంద్రాల్లో.. రేడియేషన్ నియంత్రణకు ఆవుపేడను వాడుతున్నారా? ఈ ప్రశ్నలకు కేంద్ర పశుసంర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న...
- సూర్యకిరణాలు బంగారంగా మార్పు!!
- కామధేను ఆయోగ్ వెబ్సైట్లో వివరాలు
- 25న ‘కౌ సైన్స్’పై దేశవ్యాప్తంగా పరీక్షలు
- విమర్శిస్తున్న పలు వర్సిటీల ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి రక్షణ కల్పించే శక్తి ఆవుపేడకు ఉందా? భారత్, రష్యాల్లోని అణుకేంద్రాల్లో.. రేడియేషన్ నియంత్రణకు ఆవుపేడను వాడుతున్నారా? ఈ ప్రశ్నలకు కేంద్ర పశుసంర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అవుననే అంటోంది. గో విజ్ఞానం(కౌ సైన్స్) పేరుతో దేశవ్యాప్తంగా ఈ నెల 25న నిర్వహించనున్న పరీక్షల్లో భాగంగా.. తన వెబ్సైట్లో అందుబాటులో పెట్టిన స్టడీ మెటీరియల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలోనూ ఆవు పేడ కారణంగా చాలా ప్రాణాలు నిలిచాయని పేర్కొంది. భారతీయ ఆవులపై ఉండే మూపురాలకు ప్రత్యేక శక్తి ఉందని వెల్లడించింది. మూకురాల్లోని శక్తి సూర్యకిరణాలను బంగారంగా మారుస్తుందని, అందుకే ఆవుపాలు పసుపువర్ణంలో ఉంటాయని స్పష్టం చేసింది. గో విజ్ఞాన పరీక్షకు జనవరి 15 నుంచి ఈ నెల 20 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు జరగ్గా.. మొత్తం 5.10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వెల్లడించింది. ఆదివారం నిర్వహించిన మాక్ టెస్ట్‌కు భారీగా స్పందన వచ్చిందని వివరించింది. కాగా.. ఈ పరీక్షను ప్రోత్సహిస్తూ దేశంలోని 900 విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) లేఖ రాయడాన్ని పలువురు ప్రొఫెసర్లు తప్పుపట్టారు. ఈ చర్య మూఢనమ్మకాలను ప్రోత్సహించేదిగా ఉందని విమర్శించారు. కేరళకు చెందిన ప్రగతిశీల సంస్థ.. సాహిత్య పరిషత్ ఈ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.