నాగాలాండ్‌లో ఆ చట్టం ఉపసంహరణకు కమిటీ!
ABN , First Publish Date - 2021-12-27T00:54:17+05:30 IST
సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరణ

న్యూఢిల్లీ : సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరణ గురించి పరిశీలించేందుకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (ఎన్ఈ) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, IGAR (N), సీఆర్పీఎఫ్ ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ కమిటీ నివేదిక 45 రోజుల్లోగా వస్తుందని పేర్కొంది. ఈ సిఫారసుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. వారంట్ లేకుండా అనుమానితులను అరెస్టు చేయడానికి భద్రతా దళాలకు ఈ చట్టం ప్రకారం అధికారాలు లభిస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఓ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో, ఉప ముఖ్యమంత్రి వై పట్టోన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
డిసెంబరు 4న నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో సైన్యం జరిపిన కాల్పుల్లో సామాన్యులు మరణించడంతో ఈశాన్య రాష్ట్రాలు కలిసికట్టుగా సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతున్నాయి. ఈ సంఘటనతో నేరుగా సంబంధంగలవారిపై దర్యాప్తు జరుపుతామని నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.