ముంబైలో కేంద్ర మంత్రి రాణె అరెస్టు!

ABN , First Publish Date - 2021-08-25T07:46:10+05:30 IST

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు..

ముంబైలో కేంద్ర మంత్రి  రాణె అరెస్టు!

‘మహారాష్ట్ర సీఎం చెంప పగలగొట్టేవాడ్ని’ అన్న వ్యాఖ్యల ఫలితం.. 20 ఏళ్లలో తొలిసారి మంత్రి అరెస్ట్‌! 

రాణెను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పరువు నష్టం సహా పలు సెక్షన్ల కింద 

ఎఫ్‌ఐఆర్‌.. హైకోర్టులో మంత్రి పిటిషన్‌

అత్యవసర విచారణకు వినతి.. తిరస్కరణ

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను

తిరస్కరించిన రత్నగిరి కోర్టు

బెయిల్‌ ఇచ్చిన మహద్‌ కోర్టు.. విడుదల

ముఖ్యమంత్రి ఠాక్రే అనుకున్నది చేశారు

నేనేం చేయాలో అది చేస్తా: రాణే

ఆయన అరెస్టు రాజ్యాంగ ఉల్లంఘనే: నడ్డా

మంత్రి పదవి నుంచి తప్పించాలి: సేన


ముంబై, ఆగస్టు 24: సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అత్యవసర విచారణకు హైకోర్టు తిరస్కరించినా మహద్‌ కోర్టు ఆయనకు అర్ధరాత్రి బెయిల్‌ ఇచ్చింది. అనంతరం ఆయన విడుదల అయ్యారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా సీఎంకు తెలియదని, తాను ఆ సభలో ఉంటే చెంప పగలగొట్టేవాడినని రాణె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం సృష్టించాయి. దీంతో రాణెపై చర్యలు తీసుకోవాలని నాసిక్‌ పోలీసులకు శివసేన ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 500 (పరువునష్టం), 505(2) (హానికరం), 153-బీ(1)(సి) (విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేంద్ర మంత్రి రాణెను తక్షణమే అరెస్టు చేయాలంటూ నాసిక్‌ పోలీస్‌ కమిషనర్‌ దీపక్‌ పాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు ఒక బృందాన్ని పంపారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి రాణెను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆయన్ను సంగమేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాణె మద్దతుదారులు స్టేషన్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒక కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్టు చేయడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ఈ వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ రాణె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాణేపై నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. రాణెపై పుణె, నాసిక్‌, మహద్‌లోనూ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ర్టీ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ముందస్తు బెయిలు కోసం రాణె పెట్టుకున్న పిటిషన్‌ను రత్నగిరి కోర్టు తిరస్కరించింది. కాగా, రాణేను అరెస్టు చేయనున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి తప్పుడు వార్తలు రాయొద్దన్నారు. తానేమీ సామాన్య వ్యక్తిని కాదని, కేంద్ర మంత్రినని తెలిపారు. అవసరమైతే మీడియాపై కేసు వేస్తానని కూడా హెచ్చరించారు. 

 రాణేను రత్నగిరి జిల్లాలోని గలవలిలో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆయన్ను సంగమేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని, మహద్‌లో కూడా కేసు నమోదవడంతో అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు రాయ్‌గఢ్‌ పోలీసులకు అప్పగించామని తెలిపారు. కాగా, రాణెకు మంగళవారం రాత్రి పొద్దుపోయాక మహద్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మహద్‌ కోర్టుకు రాణె వ్యక్తిగతంగా హాజరవగా.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు కోరారు. రాణెపై కేసులు వెనుక వేరే  ఉద్దేశాలు లేవని.. చట్టం ముందు అందరూ సమానమేనని మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఆయనకు బెయిల్‌ రావడం పట్ల తమకు ఇబ్బందేమీ లేదన్నాయి.

నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారు: రాణె


మహారాష్ట్ర పోలీసులు తనకు ఎలాంటి నోటీసు చూపకుండానే అరెస్టు చేశారని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణె చెప్పారు. సంగమేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆయన్ను తరలిస్తుండగా ఓ వార్తా సంస్థ ప్రతినిధితో వీడియో కాల్‌లో మాట్లాడారు. ‘‘నేను గోల్వాల్కర్‌ గురూజీ ఆశ్రమంలో భోజనం చేస్తుండగా.. 3 గంటల ప్రాంతంలో ఓ డీసీపీ వచ్చారు. నన్ను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. నోటీసు ఉందా? అని అడగ్గా.. ఏమీ లేదని చెప్పి, సంగమేశ్వర్‌ స్టేషన్‌కు తరలించారు. తర్వాత డీసీపీ గదిలోకి వెళ్లి రెండు గంటల పాటు బయటకు రాలేదు. ఆయన వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని రాణె చెప్పారు. తాను సీఎంను చెంప పగలగొడతానని అనలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటని.. తాను అక్కడ ఉండి ఉంటే చెంప పగలగొట్టేవాడినని మాత్రమే అన్నానన్నారు. 

రాజ్యాంగ విలువల ఉల్లంఘనే: నడ్డా


మహారాష్ట్ర సర్కారు తీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమేనన్నారు. ఇలాంటి చర్యలను తమ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. మరోవైపు రాణె వ్యాఖ్యలను సమర్థించబోనని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. రాణె వ్యాఖ్యలకు మద్దతివ్వబోమని, కానీ ఆయనకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని మాజీ సీఎం ఫడణవీస్‌ తెలిపారు. 

కాగా, రాణె ప్రాణాలకు ప్రమాదం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్‌ లాడ్‌ ఆరోపించారు. ఆయన వయసు 69 ఏళ్లని, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు.  సాయంత్రం 6 గంటల వరకు పోలీసులు ఆయన్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చలేదని తెలిపారు.మరోవైపు రాణే భోజనం చేస్తుండగా అరెస్టు చేశారంటూ.. ఆయన చేతిలో భోజనం ప్లేటు ఉండగా, పార్టీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన దృశ్యాలతో కూడిన వీడియోను బీజేపీ నాయకులు వీడియోను విడుదల చేశారు. ‘సార్‌ తింటున్నారు. ఒక్క నిమిషం. మీరు నన్ను తాకొద్దు’ అంటూ రాణె కుమారుడు నితేశ్‌ చెప్పారు. కాగా, రాణెను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ వినాయక్‌ రౌత్‌ లేఖ రాశారు. 

ఇదీ విషయం..

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ్‌ రాణె సోమవారం రాయ్‌గఢ్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వా తంత్య్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందని తన సిబ్బందిని అడిగారు. ఆ రోజు నేనక్కడ ఉండి ఉంటే ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణె వ్యాఖ్యానించారు. దీంతో శివసేన పార్టీ శ్రేణులు రాణె నివాసంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలపై రాళ్లు రువ్వారు. రాణె పోస్టర్లను తగులబెట్టారు. రాణెకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పలు చోట్ల బీజేపీ, శివసేన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. 


Updated Date - 2021-08-25T07:46:10+05:30 IST