ఎమ్మెస్పీపై చర్చకు పట్టు

ABN , First Publish Date - 2021-11-29T08:20:34+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో.. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై ప్రధానంగా చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి....

ఎమ్మెస్పీపై చర్చకు పట్టు

రైతు సమస్యలు, పెగాస్‌సపై చర్చకు డిమాండ్‌.. కేంద్రం నో

లఖీంపూర్‌ ఖీరీ ఘటనలో కేంద్ర మంత్రిని తొలగించాలన్న విపక్షాలు

సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్న రాజ్‌నాథ్‌

ప్రతిపక్షాలను తప్పుబట్టడం సరికాదన్న మల్లికార్జున ఖర్గే

వాడివేడిగా అఖిలపక్ష సమావేశం.. హాజరు కాని ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో.. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై ప్రధానంగా చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రైతుల డిమాండ్‌ మేరకు ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ అంశంపై పార్లమెంటులో సవివరంగా చర్చించాలని సూచించింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా సాగింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన భేటీలో 31 పార్టీలకు చెందిన 42 మంది నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ఎమ్మెస్పీతో పాటు రైతుల సమస్యలన్నింటిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. లఖింపూర్‌ ఖేరీలో రైతులపై వాహనం నడిపి నలుగురి మరణానికి కారణమైన ఆశిష్‌ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను క్యాబినెట్‌ నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును మొదటి రోజే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు అనేక అంశాలను సభలో చర్చించాలని డిమాండ్‌ చేశాయి.


దీంతో పాటు.. పెగాసస్‌ నిఘా, త్రిపురలో హింసాకాండ, పెట్రో ధరల పెరుగుదల, బొగ్గు కొరత, క్రిప్టో కరెన్సీ రద్దు, కొవిడ్‌ వ్యాప్తి తదితర అంశాలపై కూడా చర్చించాలని నేతలు సూచించారు. అలాగే, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును కూడా ఆమోదించాలని కొందరు నేతలు పట్టుపట్టారు. కాగా, పెగాసస్‌, సాగు చట్టాలపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన చర్చలు సాధ్యమని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సమావేశానికి ప్రధాని హాజరుకాకపోవడంపై ప్రహ్లాద్‌ జోషీ వివరణ ఇచ్చారు. విదేశీ ప్రతినిధుల సమావేశంలో ప్రధాని బిజీగా ఉన్నందు వల్లే రాలేకపోయారని, అయినా ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది ఆయనే కాబట్టి.. తప్పనిసరిగా హాజరుకావాలన్న నిబంధన ఏమీ లేదని చెప్పారు. కాగా పార్లమెంటు స్తంభించడానికి ప్రతిపక్షాలే కారణమన్నట్లు ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే తప్పుబట్టారు. 

 

పెట్టుబడుల ఉపసంహరణ వద్దు

లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని తృణమూల్‌ కాంగ్రెస్‌ కోరింది. దేశ ఆర్థిక విధానంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్రం వెనుకాడుతోందని తృణమూల్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ అన్నారు. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్న తనను మాట్లాడనీయలేదని, అందుకే తాను అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్‌ చేశానని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ప్రకటించారు. సాగు చట్టాల మాదిరే కశ్మీర్‌లో 370 అధికరణను వెనక్కి తీసుకోవాలని నే షనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కోరారు. కాగా పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో మీడియాను నియంత్రించడం సరికాదని అభిప్రాయపడ్డారు. 


జస్టిస్‌ రమణ హితబోధను పాటించండి

చట్టసభల్లో చర్చల స్థాయి తగ్గిపోతోందని, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల్లో అస్పష్టత ఉన్నందువల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందని, అది ప్రజలు, లబ్ధిదారులకు ఇబ్బందిగా మారుతోందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ చేసిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిటాస్‌ సమావేశంలో గుర్తు చేశారు. పార్లమెంట్‌ పూర్వవైభవాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. అధికార పార్టీ.. ప్రతిపక్షాలు చెప్పేది వినడం నేర్చుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్‌లో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.

Updated Date - 2021-11-29T08:20:34+05:30 IST