మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్... పాక్‌కు అమిత్ షా హెచ్చరిక...

ABN , First Publish Date - 2021-10-14T23:01:31+05:30 IST

దాడి చేసినవారితో కూర్చుని చర్చించే రోజులు ఒకప్పుడు

మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్... పాక్‌కు అమిత్ షా హెచ్చరిక...

న్యూఢిల్లీ : దాడి చేసినవారితో కూర్చుని చర్చించే రోజులు ఒకప్పుడు ఉండేవని, ఇవి ఉగ్రవాద దాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. గోవాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేస్తూ, పాకిస్థాన్‌ను హెచ్చరించారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం చాలా ముఖ్యమైన విషయమని అమిత్ షా చెప్పారు. భారత దేశ సరిహద్దులకు ఎవరూ విఘాతం కలిగించలేరనే సందేశాన్ని పంపించామని చెప్పారు. గతంలో చర్చలు జరిపేవారమని, కానీ ప్రస్తుతం ‘తిరిగి ఇచ్చే’ సమయం వచ్చిందని చెప్పారు. 


మనోహర్ పారికర్ గోవాకు చెందినవారే. ఆయన సేవలను ప్రస్తావిస్తూ అమిత్ షా ఈ హెచ్చరిక చేశారు. పూంఛ్‌లో ఉగ్రవాదులు దాడి చేసినపుడు, భారత దేశం సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో దీటుగా సమాధానం చెప్పిందన్నారు. ఇది నూతన అధ్యాయానికి నాంది అని తెలిపారు. (ఉగ్రవాదుల) భాషలోనే తాము సమాధానం చెబుతామనే సందేశాన్ని భారత దేశం పంపించిందని చెప్పారు. 


కొద్ది రోజులుగా జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు హిందువులు, సిక్కులను గుర్తించి మరీ చంపుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ చెప్పారు. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను ఉగ్రవాదులు వారి ఐడెంటిటీ కార్డులు తనిఖీ చేసి మరీ చంపారని ఆ టీచర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అమిత్ షా మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో సమాధానం చెబుతామని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. 


ఉరిపై ఉగ్రవాద దాడిపై స్పందిస్తూ, 2016 సెప్టెంబరులో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-10-14T23:01:31+05:30 IST