తగ్గిపోతున్న మోదీ, జగన్ ప్రభ.. పడిపోతున్న రేటింగ్స్

ABN , First Publish Date - 2021-08-17T22:00:26+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో ఇంకా వెలిగిపోతోందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారా?

తగ్గిపోతున్న మోదీ, జగన్ ప్రభ.. పడిపోతున్న రేటింగ్స్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభ దేశంలో ఇంకా వెలిగిపోతోందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారా? కొవిడ్‌ను ఎదుర్కోవడంలో మోదీ నిజంగానే విజయం సాధించారా? ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి సంగతేంటి? ప్రజాస్వామ్యం స్థితి ఏంటి? బీజేపీని ఎదురొడ్డే శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ సంపాదించుకుంటోందా? సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందా? అతి శృంగారాన్ని ఒలకబోస్తున్న ఓటీటీకి కూడా సెన్సార్ అవసరమా? ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసింది? మరి ప్రజల ‘మూడ్’ ఎలా ఉందో తెలుసుకుందామా?


‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే దేశ ప్రజలు వెలిబుచ్చే అభిప్రాయాలకు నిలువుటద్దం లాంటిది. ప్రతి ఏడాది జనవరి, ఆగస్టులో ఈ సర్వే ఫలితాలు వెల్లడవుతుంటాయి. ఇక, తాజా సర్వేను ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 115 పార్లమెంటరీ, 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల 10-20 మధ్య నిర్వహించారు.


మొత్తంగా 14,559 మందిని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 29 శాతం పట్టణ ప్రాంతాలకు చెందినవారు. అలాగే, 50 మందిని నేరుగా, మిగతా 50 శాతం మందిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. పైన పేర్కొన్న అంశాలపై వారి అభిప్రాయాలను రాబట్టారు. అలాగే, రైతు చట్టాలు, సెంట్రల్ విస్టా నిర్మాణం, మత సామరస్యం, మహిళా రక్షణ వంటివాటిపైనా ప్రశ్నలు సంధించింది. 


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయం సాధించేదెవరు?

ఈ ఏడాది జనవరిలో ఇదే ప్రశ్నకు బీజేపీ గెలుస్తుందని 43 శాతం మంది చెప్పగా, కాంగ్రెస్ గెలుస్తుందని 27 శాతం మంది చెప్పారు. ఇతరులు గెలుస్తారని 30 శాతం మంది చెప్పారు. గతేడాది ఆగస్టులో ఇదే ప్రశ్నకు 42 శాతం బీజేపీ గెలుస్తుందని, 27 శాతం మంది కాంగ్రెస్ గెలుస్తుందని, 31 శాతం మంది ఇతరులు గెలుస్తారని చెప్పారు. 


ప్రధానిగా మోదీ పనితీరుపై రేటింగ్..

ప్రధానిగా మోదీ పనితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు ఈ ఏడాది జనవరిలో బాగుందని 44 శాతం మంది చెబితే, అద్భుతం అని 30 శాతం మంది చెప్పారు. పరవాలేదు అని 17 శాతం మంది చెబితే, చెత్తగా ఉందని 8 శాతం మంది చెప్పారు. గతేడాది ఆగస్టులో ఇదే ప్రశ్నకు బాగుందని 48 శాతం మంది చెబితే, అద్భుతం అని 30 శాతం మంది చెప్పారు. పరవాలేదని 17 శాతం చెబితే, చెత్తగా ఉందన్న వారి సంఖ్య 5 శాతంగా ఉంది. అంటే ఆ ఆరు నెలల కాలంలో మోదీ ప్రదర్శనపై ప్రజల ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదు. 


మొత్తంగా ఎన్డీయే ప్రభుత్వ పాలనపై అభిప్రాయం ఇలా..

ఎన్డీయే పాలనపై 21 శాతం మంది బాగా సంతృప్తి వ్యక్తం చేస్తే, 45 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 21 శాతం మంది మధ్యస్తంగా ఉండిపోయారు. 8 శాతం సంతృప్తి చెందలేదు. 3 శాతం మంది అస్సలు సంతృప్తి చెందలేదు. గతేడాది ఆగస్టులో ఇదే ప్రశ్నకు 24 శాతం మంది బాగా సంతృప్తి చెందితే, 48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 19 శాతం మంది మధ్యస్తంగా ఉంటే 8 శాతం మంది అస్సలు సంతృప్తి చెందలేదు. 


మోదీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద ఘనత

ఈ ప్రశ్నకు 27 శాతం మంది అయోధ్య రామ మందిరంపై అనుకూల తీర్పు అంటే 20 శాతం జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అని పేర్కొన్నారు.  8శాతం మంది ఆత్మనిర్భర్ భారత్ అని చెబితే, 9 శాతం మంది మేకిన్ ఇండియా అని పేర్కొన్నారు. 15 శాతం మంది కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారని వివరించారు. 


మోదీ ప్రభుత్వ వైఫల్యాలు

మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై అడిగిన ప్రశ్నకు.. కొవిడ్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోయారని 8 శాతం మంది పేర్కొంటే, నిరుద్యోగం అని 29 శాతం మంది, నోట్ల రద్దు అని 10 శాతం మంది, ధరల పెరుగుదల అని 13 శాతం మంది, రైతు ఉద్యమమని 9 శాతం మంది పేర్కొన్నారు. 


ఆర్థిక పరిస్థితిపై కొవిడ్ ప్రభావం ఎంత?

ఈ ప్రశ్నకు.. తమ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని  గతేడాది ఆగస్టులో 62 శాతం మంది చెబితే, ఈ ఏడాది జనవరిలో 66 శాతం మంది చెప్పారు. కొవిడ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాన్ని కోల్పోయామని 19 శాతం మంది ఈ ఏడాది జనవరిలో చెప్పారు. గతేడాది ఆగస్టులో 22 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. తమ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఈ జనవరిలో 12 శాతం మంది చెప్పారు. గతేడాది ఆగస్టులో 15 శాతం మంది ఇలాగే చెప్పారు. 


కరోనా బారినపడి కుటుంబ సభ్యులకు చికిత్స

కరోనా బారినపడిన కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చామని గతేడాది ఆగస్టులో 61 శాతం మంది చెబితే, ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లినట్టు 24 శాతం మంది చెప్పారు. 


కొవిడ్‌ను మోదీ ఎలా ఎదుర్కొన్నారు?

ఈ ప్రశ్నకు గతేడాది ఆగస్టులో 48 శాతం బాగానే హ్యాండిల్ చేశారని చెప్పగా, ఈ ఏడాది జనవరిలో 50 శాతం మంది చెప్పారు. 23 శాతం మంది అద్భుతమని ఈ ఏడాది జనవరిలో చెప్పారు. గతేడాది ఆగస్టులో 29 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. అస్సలు బాగాలేదని జనవరిలో  7 శాతం మంది చెప్పారు. 


కరోనా వ్యాక్సిన్ తీసుకుంటారా?

76 శాతం టీకా తీసుకుంటామని చెబితే, తీసుకునేది లేదని 21 శాతం మంది, చెప్పలేమని 3 శాతం మంది పేర్కొన్నారు. 


బెస్ట్ సీఎం ఎవరంటే?

దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు ఈ ఏడాది జనవరిలో 24 శాతం మంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేశారు. కేజ్రీవాల్‌కు 15 శాతం మంది, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి 9 శాతం మంది, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు  7 శాతం మంది, ‘మహా’ సీఎం ఉద్ధవ్ థాకరేకు 7 శాతం మంది, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు 6 శాతం మంది ఓటేశారు. ఇక, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  బెస్ట్ సీఎం అంటూ గతేడాది 11 శాతం మంది కీర్తిస్తే ఈసారి ఆ సంఖ్య ఏకంగా ఆరుకు పడిపోయింది.


అత్యుత్తమ ప్రధాని ఎవరు?

అత్యుత్తమ ప్రధానిగా కీర్తికెక్కిన ప్రధాని నరేంద్రమోదీ ప్రభ ఈసారి గణనీయంగా తగ్గింది. 38 శాతం మంది మాత్రమే ఆయనను బెస్ట్ పీఎంగా పేర్కొన్నారు. వాజ్‌పేయిని 18 శాతం మంది, ఇందిరాగాంధీని 11 శాతం మంది, నెహ్రూను 8 శాతం మంది, రాజీవ్‌ను 21 శాతం మంది ఈ ఏడాది జనవరిలో పేర్కొన్నారు. 


దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో లేదని 47 శాతం మంది పేర్కొంటే, ప్రమాదంలో ఉందని 42 శాతం మంది, చెప్పలేమని 11 శాతం మంది చెప్పలేమని పేర్కొన్నారు. 


దేశంలో అవినీతి సంగతేంటి?

దేశంలో అవినీతి దారుణంగా పెరిగిపోయినట్టు 76 శాతం మంది అంగీకరిస్తే, లేదని చెప్పింది 20 శాతం మంది, చెప్పలేమని 4 శాతం మంది చెప్పారు. 


దేశంలో శాంతి భద్రతలు

దేశంలో శాంతి భద్రతలు పరిస్థితి మెరుగుపడిందని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. దిగజారాయని 26 శాతం మంది, మునుపటిలానే ఉన్నాయని 20 శాతం మంది, చెప్పలేమని 4 శాతం మంది అభిప్రాయపడ్డారు.


మహిళా రక్షణ 

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని 32 శాతం మంది పేర్కొంటే, పూర్తి రక్షణ ఉందని 45 శాతం మంది, గతంలో ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉందని  21 శాతం మంది, చెప్పలేమని 2 శాతం మంది అభిప్రాయపడ్డారు.



Updated Date - 2021-08-17T22:00:26+05:30 IST