కాశీ వీధుల్లో.. కాలినడకన..!

ABN , First Publish Date - 2021-12-15T06:46:12+05:30 IST

వారాణసీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ను, బెనారస్‌ రైల్వేస్టేషన్‌ను సోమవారం అర్ధరాత్రి సమయంలో కాలినడకన వెళ్లి సందర్శించారు...

కాశీ వీధుల్లో.. కాలినడకన..!

  అర్ధరాత్రి వేళ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌కు ప్రధాని 

  బెనారస్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన మోదీ 

  అభివృద్ధి, సుందరీకరణ పనుల పరిశీలన 


వారాణసీ/న్యూఢిల్లీ, డిసెంబరు 14: వారాణసీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ను, బెనారస్‌ రైల్వేస్టేషన్‌ను సోమవారం అర్ధరాత్రి సమయంలో కాలినడకన వెళ్లి సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలసి ఉదయం వారాణసీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. పుణ్యక్షేత్రంలో చేపట్టిన కీలక అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించినట్లు ఆర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ను సందర్శించిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. బూడిద రంగు కుర్తా, తెల్లటి పైజమా, నలుపు జాకెట్‌తో బూడిద రంగు మఫ్లర్‌ ధరించి వీధుల్లో నడిచి వచ్చిన మోదీని చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘తదుపరి స్టాప్‌ బెనారస్‌ రైల్వేస్టేషన్‌... రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రైల్వేస్టేషన్లను స్వచ్ఛమైన, ఆధునికమైన, ప్రయాణికులకు అనుకూలమైనవిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం’ అంటూ మోదీ మరో ట్వీట్‌ చేశారు.


కుమార్తెల విద్యపై దృష్టి పెట్టండి: ప్రధాని 

ఆడపిల్లలకు విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గంగా నదితో సహా దేశంలోని నదులన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వారాణసీలోని స్వర్వేద్‌ మహామందిర్‌లో మంగళవారం నిర్వహించిన సద్గురు సదాఫాల్దేవ్‌ విహంగం యోగ్‌ సంస్థాన్‌ 98వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దేశానికి స్వరాజ్యం ఎంత ముఖ్యమో సుపరిపాలనా అంతే అవసరమన్నారు. జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా మారాలని అభిలషించారు. ఈ సందర్భంగా  సదాఫాల్దేవ్‌కు ప్రధాని నివాళులర్పించారు. కాగా, భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గీతా జయంతి సందర్భంగా ఆయన జాతికి శుభాకాంక్షలు తెలిపారు. 


అందుకే యోగి 

గంగలో మునగలేదు..: అఖిలేశ్‌ 

‘‘నదులు ఏవీ శుభ్రంగా లేవన్న విషయం యోగి ఆదిత్యనాథ్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన గంగా నదిలో స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నారు’’ అని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం ప్రధాని మోదీ గంగానదిలో మునిగారు. ఆ సందర్భంగా యోగి ఆయన వెంట నదిలోకి దిగి పవిత్ర స్నానం ఆచరించకపోవడంపై అఖిలేశ్‌ స్పందించారు. గంగానదిలో నిలబడి ఉన్న మోదీ ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘‘గంగామాత ఒడిలో కొత్త కాశీ వాస్తు శిల్పి’’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. 


రామజన్మభూమిలో నేడు ‘బీజేపీ’ సీఎంల పూజలు

అయోధ్యలోని రామజన్మభూమిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొత్తం 11 మంది ముఖ్యమంత్రులు ఈ పూజల్లో పాల్గొననున్నట్టు ప్రొటోకాల్‌ అధికారులు తెలిపారు.


నూరేళ్ల కిందట ఇదే రోజున... 

వారాణసీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ  2021 డిసెంబరు 13న కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ను ప్రారంభించగా... సరిగ్గా నూరేళ్ల క్రితం ఇదే రోజున అంటే 1921 డిసెంబరు 13న వేల్స్‌ యువరాజు ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ బెనారస్‌ (ఇప్పటి వారాణసీ)లో అధికారికంగా పర్యటించడం యాధృచ్ఛికం. తన పర్యటనలో భాగంగా అప్పట్లో ఆయన బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో పలు నూతన భవనాలను ప్రారంభించినట్లు రికార్డుల్లో నమోదైంది. పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించిన వేల్స్‌ యువరాజుకు నాటి బెనారస్‌ మహారాజు ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా సోమవారం ఉదయం నగరానికి చేరుకున్న మోదీని కూడా వారాణసీ ప్రజలు గులాబీ రేకుల వర్షంతో ఘనంగా స్వాగతించారు. అప్పట్లో యువరాజుకు 31సార్లు తుపాకీ పేల్చి గౌరవ వందనం సమర్పించగా, ఇప్పుడు మోదీ రాకను పురస్కరించుకొని గంగా నది ఒడ్డున భారీఎత్తున బాణసంచా కాల్చి గౌరవించడం విశేషం.

Updated Date - 2021-12-15T06:46:12+05:30 IST