అంతరిక్షంలోకి మోదీ ఫొటో!
ABN , First Publish Date - 2021-02-16T09:29:50+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తొలిసారి దేశీయ ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఓ ఉపగ్రహంలో ప్రధాని మోదీ ఫొటోతో పాటు భగవద్గీతను, 25 వేల
భగవద్గీత, 25వేల మంది పేర్లు కూడా..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తొలిసారి దేశీయ ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఓ ఉపగ్రహంలో ప్రధాని మోదీ ఫొటోతో పాటు భగవద్గీతను, 25 వేల మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ నెల 28న పీఎ్‌సఎల్‌వీ వాహక నౌక ద్వారా సతీశ్ ధావన్ ఉపగ్రహం(ఎస్డీ శాట్) అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. విద్యార్థుల్లో అంతరిక్ష శాస్త్రంపై ఉత్సాహాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న స్పేస్‌కిడ్జ్ ఇండియా సంస్థ ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారు చేసింది. ‘‘మేం తయారు చేసిన తొలి ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లనుండడంతో ఉత్కంఠగా ఉంది. మా మిషన్ పూర్తయిన తర్వాత అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు పంపాలని కోరాం.
వారం రోజుల్లోనే 25 వేల మంది పంపారు. ఇందులో 1000 పేర్లు విదేశీయులవి. చెన్నైలోని ఓ పాఠశాల తన విద్యార్థులందరి పేర్లనూ పంపింది. అంతరిక్ష శాస్త్రంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం’’ అని స్పేస్‌కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో శ్రీమతి కేసన్ తెలిపారు. ఇతర దేశాల్లో అంతరిక్ష పరిశోధనా సంస్థలు వారికి పవిత్రమైన బైబిల్ లాంటి గ్రంథాలను పంపాయని.. అదే తరహాలో మనకు అత్యంత పవిత్రమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించామని కేసన్ చెప్పారు. ప్రధాని మోదీ ఫొటో, దానిపై ఆత్మనిర్భర్ మిషన్ అని రాసి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని ఎలకా్ట్రనిక్స్, సర్క్యూట్లు సహా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయా రు చేసినట్లు ఆమె వివరించారు. ఉపగ్రహం కింది భాగంలో ఇస్రో చైర్మన్ కె.శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఆర్.ఉమామహేశ్వరన్ పేర్లు కూడా రాసినట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో భారతీయ స్టార్ట్‌పలు తయారు చేసిన ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ నెల 28న పీఎ్‌సఎల్‌వీ-సీ51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన ఉపగ్రహంతో పాటు భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన సతీశ్ ధావన్, ఆనంద్, యూనిటీశాట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నీరు, ఇతర సామగ్రిని తీసుకెళ్లేందుకు రష్యా సోమవారం కజకిస్థాన్‌లోని బైకనూర్ నుంచి ప్రయోగించిన ‘ద ప్రోగ్రెస్ ఎంఎస్-16’ కక్ష్యలోకి ప్రవేశించింది.