మోదీ హయాంలో భారత్ ఘన విజయాలు : అమిత్ షా

ABN , First Publish Date - 2021-05-30T22:56:08+05:30 IST

భారత దేశాన్ని ఏడేళ్ళ నుంచి విజయవంతంగా పరిపాలిస్తున్న

మోదీ హయాంలో భారత్ ఘన విజయాలు : అమిత్ షా

న్యూఢిల్లీ : భారత దేశాన్ని ఏడేళ్ళ నుంచి విజయవంతంగా పరిపాలిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అభినందించారు. మోదీ పరిపాలన వార్షికోత్సవాల సందర్భంగా అమిత్ షా ఇచ్చిన ట్వీట్లలో ఈ ఏడేళ్ళలో భారత దేశం మునుపెన్నడూ లేనటువంటి ఘన విజయాలను సాధించినట్లు తెలిపారు. దేశ భద్రత, ప్రజా సంక్షేమం, సంస్కరణల రంగాల్లో మన దేశం విజయాలు నమోదు చేసుకుందన్నారు. 


మోదీ తన శక్తిమంతమైన నాయకత్వ పటిమతో దేశాన్ని బలోపేతం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. రైతులు, అణగారిన వర్గాలు, పేదల జీవన ప్రమాణాలను పెంచారని, వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చారని అభినందించారు. ఈ విజయాలను సాధించడంలో మోదీ దృఢనిశ్చయం, సంక్షేమ విధానాలు దోహదపడినట్లు పేర్కొన్నారు. 


అభివృద్ధి, భద్రత, ప్రజా సంక్షేమం, మైలురాళ్ళ వంటి సంస్కరణల మధ్య సాటిలేని సమన్వయానికి మోదీ ప్రభుత్వం ఉదాహరణగా నిలుస్తోందని తెలిపారు. మోదీ సేవల పట్ల, అంకితభావం పట్ల దేశ ప్రజలు ఏడేళ్ళ నుంచి నిరంతరం నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 


ప్రతి సవాలును మోదీ దార్శనిక నాయకత్వంలో అధిగమించగలమని, భారత దేశ అభివృద్ధి ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతుందని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-30T22:56:08+05:30 IST