మోదీ కారు ధర 12 కోట్లు కాదు!
ABN , First Publish Date - 2021-12-30T07:32:21+05:30 IST
ప్రధాని మోదీ కొత్త కారు ధర విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని అధికార వర్గాలు ఖండించాయి. ప్రధాని కాన్వాయ్‌లో కొత్తగా చేర్చినమెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-650 గార్డ్ కారు ధర రూ.12 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా.. ..

అందులో మూడో వంతే: అధికార వర్గాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 29: ప్రధాని మోదీ కొత్త కారు ధర విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని అధికార వర్గాలు ఖండించాయి. ప్రధాని కాన్వాయ్‌లో కొత్తగా చేర్చినమెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-650 గార్డ్ కారు ధర రూ.12 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా.. అధికార వర్గాలు మాత్రం ధర అందులో మూడో వంతు మాత్రమే ఉంటుందని చెబుతున్నాయి. పైగా ప్రతి రెండేళ్లకోసారి ప్రధాని కాన్వాయ్‌లో కార్లను మార్చడం సాధారణమేనన్నాయి. ఇంతకుముందు ఉపయోగించి బీఎండబ్ల్యూ కారు తయారీని జర్మనీ సంస్థ నిలిపివేసిందని తెలిపాయి. కాగా, అత్యంత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ కారును ప్రధాని భద్రత ను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎంపిక చేసింది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఇందులో ప్రయాణించే వారికి హాని జరగని విధంగా డిజైన్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక సేఫ్టీ రేటింగ్ అయిన వీఆర్-10 రేటింగ్ దీని సొంతం. కారు బాడీని పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్‌తో తయారు చేయడంతో సమీపంలో ఎంతటి శక్తివంతమైన పేలుడు జరిగినా, మిలిటరీ రైఫిళ్లతో బుల్లెట్ల వర్షం కురిపించినా ఇందులోని వారికి రక్షణ లభిస్తుంది. ఇక ఫ్యూయల్ ట్యాంక్‌కు ప్రత్యేకమైన పదార్థంతో పూత పూసి ఉంటుంది. దీంతో కారు లోపల ఏవైనా మంటలు వ్యాపించినా ట్యాంక్ వాల్వ్‌లు మూసుకుపోతాయి. ఎవరైనా విషవాయువుతో దాడి చేస్తే.. లోపలికి స్వచ్ఛమైన గాలి అందేలా ఏర్పాటు ఉంటుంది. 650 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఆరు లీటర్ల వీ12 ఇంజన్ మెర్సిడెజ్ మేబ్యాచ్ సొంతం. దీనికి 360 డిగ్రీల కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. కాగా, తాను సన్యాసిగా చెప్పుకొనే మోదీ.. ఖరీదైన సన్యాసిగా మారారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ వ్యాఖ్యానించారు. రూ.8 వేల కోట్ల విమానం, రూ.20 కోట్ల కారులో తిరుగుతూ, రూ.2 వేల కోట్ల విలువైన ఇంట్లో ఉంటున్నారని విమర్శించారు. కొవిడ్ వల్ల ప్రజలు ఉపాధి లేక అల్లాడుతుంటే ప్రధాని ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.