బళ్లారిలో BJP ఘన విజయం
ABN , First Publish Date - 2021-12-15T16:59:31+05:30 IST
విధాన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో బళ్లారి జిల్లాలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన వైఎం సతీష్ విజయకేతనం ఎగరవేశారు. ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేసీ కొండయ్య పై 757 ఓట్ల ఆధిక్యతతో విజయం

బళ్లారి(బెంగళూరు): విధాన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో బళ్లారి జిల్లాలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన వైఎం సతీష్ విజయకేతనం ఎగరవేశారు. ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేసీ కొండయ్య పై 757 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి రాంప్రసాద్ మనోహర్ తెలిపారు. మంగళవారం బళ్లారిలోని పాల్‌టెక్నిక్ కళాశాలలో ఓట్లు లెక్కింపు జరిగింది. మొత్తం 4663 మంది ఓటర్లు ఉండగా 4654 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కే.సీ కొండయ్య 1902 ఓట్లు, బీజేపీ అభ్యర్థి వైఎం సతీ్‌షకు ఓట్లు 2659 పోల్ అయ్యాయి. ఇండిపెండెంట్లు గంగిరెడ్డికి నాలుగు, సీఎం మంజునాథ్‌కు రెండు ఓట్లు పడ్డాయి. 87 ఓట్లు చెల్లలేదు.
నాయకులంతా శ్రమించారు : వైఎం సతీష్
పరిషత్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, ఇతరులు అంతా కలిసి పనిచేశారని ఆ పార్టీ తరపు ఎమ్మెల్సీ విజయం సాధించిన వైఎం సతీష్ పేర్కొన్నారు. రాజకీయంగా తాను కొత్తే అయినా ప్ర భుత్వం నుంచి నిధులను తెచ్చి బళ్లారి జిల్లా అభివృద్దికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కేసీ కొండయ్య చాలా రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి పై విజయం సాధించడం తనకు చాలా అనందంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వద్దకు కాంగ్రెస్ అభ్యర్థి కేసీ కొండయ్య రాలేక పోయారు. ఆయన తనయుడు కేసీ ప్రసాద్ కౌంటింగ్ హల్ వద్దకు వచ్చారు. కౌంటింగ్ హల్‌లో కొద్దిసేపు కేసీ కొండయ్య తనయుడు కేసీ ప్రసాద్ తో వైఎం సతీష్ ఫలితాల ముందు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.