అలక వీడని మంత్రి ఆనంద్‌సింగ్‌

ABN , First Publish Date - 2021-08-20T17:35:01+05:30 IST

పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ ఇంకా అలక వీడలేదు. ఇష్టంలేని శాఖను కట్టబెట్టారని రాజీనామా చేసేందుకు సిద్దమైన ఆనంద్‌సింగ్‌ ఆతర్వాత కాస్త మెత్తబడినా పూర్తిగా పట్టు వీడలేదు. తాజాగా గు

అలక వీడని మంత్రి ఆనంద్‌సింగ్‌

  - కేబినెట్‌ భేటీకి గైర్హాజరు 

  - శాఖ మార్పునకు తీవ్రయత్నాలు

  - మరోసారి ఢిల్లీలో మకాం 

  - దిగిరాని అధిష్టానం


బెంగళూరు: పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ ఇంకా అలక వీడలేదు. ఇష్టంలేని శాఖను కట్టబెట్టారని రాజీనామా చేసేందుకు సిద్దమైన ఆనంద్‌సింగ్‌ ఆతర్వాత కాస్త మెత్తబడినా పూర్తిగా పట్టు వీడలేదు. తాజాగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆనంద్‌సింగ్‌ గైర్హాజరయ్యారు. రాష్ట్రమంత్రులలో హాజరుకానివారు ఆనంద్‌సింగ్‌ ఒక్కరే. బసవరాజ్‌ బొమ్మై కేబినెట్‌ను 25 మందితో విస్తరించుకున్నారు. ఆనంద్‌సింగ్‌కు అవకాశం దక్కడంతో కొత్తగా ఏర్పడిన విజయనగర జిల్లాకు మంత్రి పదవి దక్కిందనే సంతోషం వ్యక్తమయ్యింది. శాఖల కేటాయింపులో ఆయనకు పర్యాటక శాఖ దక్కడంతో అలక బూనారు. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన ఆనంద్‌సింగ్‌ రాజీనామాకు సిద్దపడ్డారు. సన్నిహితులు, అభిమానులు సర్దిచెప్పడంతో రెండురోజులు మౌనంగా గడిపారు. మరోసారి ఆయన ముందుకెళ్ళేందుకే సిద్దమయ్యారు. అంతలోనే మాజీ సీఎం యడియూరప్ప పిలిపించుకుని సర్దుబాటు చేశారు. ఇదే సందర్భంలోనే ఢిల్లీ పెద్దల చెంతకు తీసుకెళతానని సీఎం బసవరాజ బొమ్మై కూడా హామీ ఇచ్చారు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఎవరినీ ఢిల్లీకు తీసుకురాకూడదని బెదిరింపులకు లొంగరాదని ముఖ్యమంత్రికి  సూ చించినట్లు సమాచారం బహిరంగమైంది. వారంరోజులు గడుస్తున్నా సీఎం ఢిల్లీ వెళ్ళే అంశం తేల్చకపోవడంతో నేరుగా ఆయనే సిద్దమయ్యారు. ఇలా బుధవారం బళ్ళారి నుంచి గోవా మీదుగా ఆనంద్‌సింగ్‌ ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చలు జరిపేందుకు ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. ఇలా హస్తినలో ఉండే ఆనంద్‌సింగ్‌ కేబినెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ఆయన సాధించుకుని వస్తారా లేక నిరుత్సాహమే మిగలనుందా అనేది తేలిపోనుంది. ఒక వేళ ఆనంద్‌సింగ్‌కు శాఖ మార్పు జరిగితే మరింత మంది ఇదే బాట పడతారనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా 24మంది మంత్రులు ఇచ్చిన శాఖలతోనే దాదాపు సర్దుకున్నా కేవలం ఆనంద్‌సింగ్‌ మాత్రమే అలకబూనినట్లు అయ్యింది. ఎంటీబీ నాగరాజుతో పాటు మరికొందరికి  శాఖలపై నిరుత్సాహం ఉన్నా బయటపడి రచ్చకెక్కితే మొదటికే ముప్పు వస్తుందనే భయం వెంటాడుతున్నట్లుగా ఉంది. ఆనంద్‌సింగ్‌ ప్రభావాన్ని బట్టి మిగిలినవారి భవిష్యత్తు ఉంటుందనిపిస్తోంది. 

Updated Date - 2021-08-20T17:35:01+05:30 IST