కోవిడ్ వల్ల అనాథలైన బాలలను కాపాడండి : కేంద్రం
ABN , First Publish Date - 2021-05-21T17:33:20+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం కుటుంబాలపై

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను కాపాడాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది. బాలలతో సహా బలహీన వర్గాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఓ లేఖ రాసింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాసిన ఈ లేఖలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ బాధిత వర్గాలపై నేరాలు జరగకుండా నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. మహిళలు, బాలలు, వృద్ధులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు వంటి బలహీన వర్గాలవారిపై నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. మానవుల అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది.
బాధితులకు సకాలంలో సహాయం అందజేయాలని తెలిపింది. అనాథ బాలలు, బలహీన వర్గాలవారిని పరిరక్షించడం కోసం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. వీరికి సహాయ పడేందుకు ప్రస్తుతం అమలవుతున్న చర్యలను తక్షణమే సమీక్షించాలని కోరింది. వయో వృద్ధులకు వైద్యపరమైన, భద్రత, రక్షణ సంబంధిత సహాయం అవసరమవుతుందని, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించవలసి ఉంటుందని వివరించింది.
ఈ అంశాలపై పోలీసులు, ప్రభుత్వ శాఖలు, పౌర సంఘాలకు అవగాహన కల్పించాలని కోరింది. కోవిడ్ ప్రభావిత బలహీన వర్గాల కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మెరుగైన సేవలను అందిస్తున్నాయని వివరించింది. ఇటువంటివారిని కాపాడటం కోసం విడుదల చేస్తున్న నిధుల గురించి కూడా ఈ లేఖలో పేర్కొంది.