గర్ల్ ఫ్రెండ్‌తో మెహుల్ చోక్సీ రొమాంటిక్ ట్రిప్ : ఆంటిగ్వా పీఎం

ABN , First Publish Date - 2021-05-31T02:35:08+05:30 IST

ఆంటిగ్వా-బార్బుడా ప్రధాన మంత్రి గస్టన్ బ్రౌనే ఆదివారం

గర్ల్ ఫ్రెండ్‌తో మెహుల్ చోక్సీ రొమాంటిక్ ట్రిప్ : ఆంటిగ్వా పీఎం

న్యూఢిల్లీ : ఆంటిగ్వా-బార్బుడా ప్రధాన మంత్రి గస్టన్ బ్రౌనే ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అంతుబట్టని రీతిలో అదృశ్యమవడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చోక్సీ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి విహారానికి వెళ్ళినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఆ సమయంలోనే ఆయనను డొమినికన్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ప్రస్తుతం ఆయనను భారత దేశానికి పంపించే అవకాశం ఉందని తెలిపారు. చోక్సీని మే 26న డొమినికన్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 


పీఎం బ్రౌనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మెహుల్ చోక్సీ ఓ పొరపాటు చేసినట్లు తెలిపారు. చోక్సీ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ప్రయాణించినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఆయన డొమినికాలో పట్టుబడ్డారని తెలిపారు. ఇక ఆయనను భారత దేశానికి అప్పగించే అవకాశం ఉందన్నారు. 


కిడ్నాప్ అంటున్న చోక్సీ న్యాయవాదులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,000 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో మెహుల్ చోక్సీ సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన తరపు న్యాయవాదుల కథనం మరో విధంగా ఉంది. చోక్సీని మే 23న భారత దేశంతో సంబంధంగలవారు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఈ కిడ్నాప్‌నకు ఆంటిగ్వా అధికారులు సహకరించారని ఆరోపిస్తున్నారు. ఆయనను కొట్టి, హింసించి, డొమినికా తీసుకెళ్ళారని, అక్కడ అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. 


ఈ ఆరోపణలను ఆంటిగ్వా-బార్బుడా పోలీసు చీఫ్ ఖండించారు. మెహుల్ చోక్సీ, ఆయన తరపు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని చెప్పారు. 


అంతకుముందు ప్రధాన మంత్రి బ్రౌనే ఓ ఎఫ్ఎం రేడియో చానల్‌తో మాట్లాడుతూ, ఓ విమానం డొమినికాకు వెళ్ళడాన్ని ధ్రువీకరించారు. మెహుల్ చోక్సీపై భారత దేశ న్యాయస్థానాల్లో కేసులు ఉన్నట్లు ధ్రువీకరించేందుకు అవసరమైన పత్రాలను భారత ప్రభుత్వం ఈ విమానంలో పంపినట్లు తెలుస్తోందని తెలిపారు. చోక్సీ పారిపోయి వచ్చినట్లు రుజువు చేయడానికి స్థానిక కోర్టులో ఈ పత్రాలను సమర్పిస్తుందని తెలిపారు. చోక్సీ డిపోర్టేషన్‌ను డొమినికా జడ్జి బుధవారం వరకు నిలుపుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. చోక్సీని తీసుకెళ్ళడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. 


ఇదిలావుండగా మెహుల్ చోక్సీని భారత దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ విషయంపై డొమినికా ప్రభుత్వంతో మన దేశంలోని అనేక దర్యాప్తు సంస్థలు నిరంతరం మంతనాలు జరుపుతున్నాయి. చోక్సీ భారతీయ పౌరుడని, భారత దేశంలోని చట్టాల నుంచి తప్పించుకునేందుకు కొత్తగా వేరొక దేశం పౌరసత్వం తీసుకున్నారని డొమినికాకు తెలియజేశాయి. ఆయన భారీ కుంభకోణానికి పాల్పడినట్లు వివరించాయి. 


Updated Date - 2021-05-31T02:35:08+05:30 IST