పగటి కలలు కనకుండా ఎవరినీ ఆపలేం : మీనాక్షి లేఖి ఎద్దేవా

ABN , First Publish Date - 2021-06-22T22:55:32+05:30 IST

ఎన్‌సీపీ చీఫ్ నివాసంలో కొందరు ప్రతిపక్ష నేతలు సమావేశమవడంపై

పగటి కలలు కనకుండా ఎవరినీ ఆపలేం : మీనాక్షి లేఖి ఎద్దేవా

న్యూఢిల్లీ : ఎన్‌సీపీ చీఫ్ నివాసంలో కొందరు ప్రతిపక్ష నేతలు సమావేశమవడంపై బీజేపీ స్పందించింది. ప్రజల తిరస్కరణకు పదే పదే గురైన నేతలు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారని పేర్కొంది. పగటి కలలు కనడం నుంచి ఎవరినీ ఆపలేమని ఎద్దేవా చేసింది. 


బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పదే పదే ప్రజల తిరస్కరణకు గురైన నేతలు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారన్నారు. ఇలాంటి సమావేశాలు జరగడం కొత్త విషయమేమీ కాదన్నారు. ఎన్నికల ద్వారా లాభాలు ఆర్జించే కంపెనీలు కొన్ని ఉన్నాయన్నారు. ఆ కంపెనీలు ప్రతి నేతనూ తదుపరి ప్రధాన మంత్రిగా ప్రచారం చేస్తూ ఉంటాయని ఎద్దేవా చేశారు. పగటి కలలు కనకుండా ఎవరినీ ఆపలేమన్నారు. 


ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీజేపీయేతర పార్టీలతో శరద్ పవార్ నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, బాలీవుడ్ ప్రముఖుడు జావేద్ అక్తర్, రాష్ట్రీయ లోక్‌దళ్ ప్రెసిడెంట్ జయంత్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఐ ఎంపీ బినయ్ విశ్వం, కొందరు మేధావులు హాజరయ్యారు. 


2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై వీరంతా చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు కానీ, వారికి సంబంధించినవారు కానీ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. 


Updated Date - 2021-06-22T22:55:32+05:30 IST