నందిగ్రామ్‌ ఫలితంపై రీకౌంటింగ్‌ చేయాల్సిందే :మమత

ABN , First Publish Date - 2021-05-04T07:28:11+05:30 IST

నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రీకౌంటింగ్‌ కోసం పట్టుబడుతున్నారు. రీకౌంటింగ్‌కు అనుమతిస్తే తన ప్రాణాలకే ప్రమాదమన్న భయంతోనే...

నందిగ్రామ్‌ ఫలితంపై రీకౌంటింగ్‌ చేయాల్సిందే :మమత

  • రీకౌంటింగ్‌ చేయాల్సిందే

కోల్‌కత, మే 3: నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రీకౌంటింగ్‌ కోసం పట్టుబడుతున్నారు. రీకౌంటింగ్‌కు అనుమతిస్తే తన ప్రాణాలకే ప్రమాదమన్న భయంతోనే రిటర్నింగ్‌ అధికారి అందుకు ఆదేశించట్లేదని ఆమె పేర్కొన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్టు చెప్పారు. ‘‘నాలుగు గంటలపాటు సర్వర్లు ఎందుకు డౌన్‌ అయ్యాయి? ఎన్నికల కమిషన్‌ లాంఛనంగా ప్రకటన చేసిన తర్వాత నందిగ్రామ్‌ ఫలితాన్ని ఎలా మార్చేస్తుంది? గవర్నర్‌ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతలోనే అంతా మారిపోయింది. దీనిపై మేం కోర్టుకు వెళ్తాం? ప్రజాతీర్పును శిరసావహించడానికి మేం సిద్ధం. కానీ, ఒక చోట ఫలితాల్లో తేడాలున్నాయంటే తెర వెనుక ఏదో జరుగుతున్నట్టే. నిజమేంటో కనిపెట్టాలని మేం కోరుకుంటున్నాం’’ అని మమత పేర్కొన్నారు. ఈ అంశంపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఒక ఎస్సెమ్మె్‌సను మీడియాకు చూపారు. ‘‘రీ కౌంటింగ్‌కు నేను ఆదేశాలివ్వలేను. అలా చేస్తే నా కుటుంబం నాశనమైపోతుంది. నాకొక కూతురుంది. చిన్నపిల్ల..’’ అంటూ నందిగ్రామ్‌ రిటర్నింగ్‌ అధికారి, వేరే అధికారికి పంపినట్టుగా చెబుతున్న ఆ ఎస్సెమ్మెస్‌ సారాంశాన్ని చదివి వినిపించారు. కాగా.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమెను సీఎంగా, బిమన్‌ బెనర్జీని ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఎన్నుకున్నారని పేర్కొంది.. మమతాబెనర్జీ సోమవారం రాత్రి 7గంటలకు రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను కలిసి సంప్రదాయం ప్రకారం.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామాను అంగీకరించానని.. కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా కొనసాగాలని కోరానని.. ధన్‌కర్‌ ట్వీట్‌ చేశారు.


శాంతి.. శాంతి..

బెంగాల్‌లో ఎన్నికల ఘట్టం ముగిశాక రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. సోమవారంనాటి ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు చనిపోయినట్టు, చాలామంది గాయపడినట్టు సమాచారం. నందిగ్రామ్‌లో బీజేపీ కార్యాలయం తగలబడిపోతుండగా చాలా మంది అక్కణ్నుంచి భయంతో పారిపోతున్న వీడియోను ఆ పార్టీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. టీఎంసీ దాడుల్లో తమ కార్యకర్తలు కనీసం ఆరుగురు చనిపోయారని.. బీజేపీ ఆరోపిస్తోంది. పూర్వ వర్ధమాన్‌ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడిలో టీఎంసీకి చెందిన ముగ్గురు మరణించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మమత తన కార్యకర్తలు, మద్దతుదారులు అందరూ శాంతిని పాటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కేంద్ర దళాలు టీఎంసీ మద్దతుదారులపై అకృత్యాలకు పాల్పడ్డాయని దీదీ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ గనక సహకరించకపోయి ఉంటే బీజేపీ 50 సీట్ల మైలురాయిని కూడా దాటి ఉండేది కాదంటూ ఈసీపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై తమకు నివేదిక పంపాల్సిందిగా కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా..  ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయాలని మమత డిమాండ్‌ చేశారు. కేంద్రం 2-3 రాష్ట్రాలకు మాత్రమే ఆక్సిజన్‌ను, టీకాలను పంపిస్తోందని ఆరోపించారు. 


ప్రధాని ఫోన్‌ చేయలేదు!

ఎన్నికల్లో తాను ఎప్పుడు గెలిచినా ప్రధాని మోదీ నుంచి ఫోన్‌ వచ్చేదని.. కానీ, ఆయన ఫోన్‌ చేయకపోవడం ఇదే మొట్టమొదటిసారి అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘‘పర్వాలేదు. ఆయన పనుల హడావుడిలో ఉండి ఉండొచ్చు. దీన్ని నేను సెంటిమెంటుగా అనుకోను’’ అని వ్యాఖ్యానించారు.


నిన్న డైలీ లేబర్‌.. నేడు ఎమ్మెల్యే!

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఫలితాల్లో నందిగ్రామ్‌ తర్వాత అందరినీ ఎక్కువగా ఆకర్షించింది.. సాల్తోరా నియోజకవర్గ ఫలితం. ఆ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన చందన బౌరి (30) ఒక రోజుకూలీ. ముగ్గురు పిల్లల తల్లి. కానీ.. ఈ ఎన్నికలు ఆమె జీవితాన్నే మార్చేశాయి. 12వ తరగతి చదివిన ఆమె.. ఇంటింటి ప్రచారం చేయడం ద్వారా ఓటర్ల మనసులను ఆకట్టుకున్నారు. టీఎంసీ అభ్యర్థి సంతోష్‌ కుమార్‌ మోండల్‌పై 4000 ఓట్ల తేడాతో గెలిచి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం.. ఆమె ఆస్తి విలువ కేవలం రూ.31,985. బ్యాంకులో ఉన్న డబ్బు రూ.6,335. రోజు కూలీ రూ.400కు తాపీ పని చేసే ఆమె భర్త ఆస్తుల విలువ రూ.30,311. అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము కేవలం రూ.1561. వారి కుటుంబానికి మూడు మేకలు, మూడు ఆవులు ఉన్నాయి. బీజేపీ తరఫున తాను అభ్యర్థిగా నిలబడతానని అస్సలు అనుకోలేదన్నారామె. పొలాలు, భూములు ఏమీ లేవు. గత ఏడాది వీరు పక్కా ఇల్లు కట్టుకోవడానికి.. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.60 వేలు ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఆ సొమ్ముతో రెండు గదుల పక్కా ఇల్లు కట్టుకున్నారు. ఆమె నేపథ్యం తెలిసి.. నెటిజన్లు ఆమెపై సోషల్‌మీడియాలో ప్రశంసలు, అభినందనల వర్షం కురిపిస్తున్నారు.


Updated Date - 2021-05-04T07:28:11+05:30 IST