అది మోదీ సొత్తు కాదు : మమత బెనర్జీ
ABN , First Publish Date - 2021-08-26T00:43:26+05:30 IST
కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నేషనల్ మానెటైజేషన్

కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్ పాలసీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలోని ఆస్తులను అమ్మేందుకు ఈ పథకాన్ని రచించారని దుయ్యబట్టారు. ఈ ఆస్తులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీలవేమీ కాదన్నారు. ఈ పాలసీ దిగ్భ్రాంతికరం, దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించారు. ఈ ఆస్తులను అమ్మగా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఖర్చు చేస్తారన్నారు.
మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ సచివాలయం వద్ద బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఈ దిగ్భ్రాంతికరమైన, దురదృష్టకరమైన పాలసీని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ ఆస్తులు దేశానికి చెందినవని చెప్పారు. ఇవి మోదీకి లేదా బీజేపీకి చెందిన ఆస్తులు కావన్నారు. దేశంలోని ఆస్తులను తమకు నచ్చినట్లుగా అమ్ముకోకూడదన్నారు. బీజేపీ సిగ్గుపడాలన్నారు. మన దేశ ఆస్తులను అమ్మేసే హక్కును వారికి ఎవరూ ఇవ్వలేదన్నారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యను యావత్తు దేశం సమైక్యంగా వ్యతిరేకిస్తుందన్నారు.
మోదీ మిత్రుల కోసమే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ప్రకటించిన నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ స్పందిస్తూ, 70 ఏళ్లుగా ప్రజా ధనంతో నిర్మించిన కిరీటంలోని రత్న, మణి, మాణిక్యాలను అమ్మేసి, తన మిత్రులైన పారిశ్రామికవేత్తలకు ఇచ్చుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సహాయపడే పథకం ఇది అని ఆరోపించారు.
టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతూ, నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్ పథకం మునుపెన్నడూ లేనటువంటి ప్రజా వ్యతిరేక పథకమని ఆరోపించారు. దీని గురించి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పలేదని, ఆ పార్టీ మేనిఫెస్టోలో దీని ప్రస్తావన లేదని అన్నారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వోద్యోగాలను తగ్గించే ప్రణాళికగా నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌ను అభివర్ణించారు. ఇది ప్రజా వ్యతిరేక చర్య అన్నారు.
ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు
నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు, మరికొన్ని సంస్థల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తారు. నిర్మల సీతారామన్ బుధవారం ముంబైలో విలేకర్లతో మాట్లాడుతూ, మానెటైజేషన్ అంటే ఆస్తులను అమ్మడం కాదని పునరుద్ఘాటించారు. ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారన్నారు. ఇవి పూర్తయిన బ్రౌన్‌ఫీల్డ్ అసెట్స్ అని, అయితే వీటి వినియోగం తక్కువగా ఉందని అన్నారు. వీటిని పరిపూర్ణంగా వినియోగంలోకి తేవడం కోసం మానెటైజేషన్ ప్రక్రియను అనుసరిస్తున్నామన్నారు.