ప్రధాని ఘోరంగా అవమానించారు
ABN , First Publish Date - 2021-05-21T08:25:56+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అవమానించారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.

సమావేశానికి పిలిచి, మాట్లాడనివ్వలేదు.. దీదీ ఫైర్
కోల్‌కతా, మే 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అవమానించారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. కొవిడ్-19పై 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, కలెక్టర్లతో ప్రధాని నిర్వహించిన వర్చువల్ సమీక్షపై ఆమె మండిపడ్డారు. సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘భేటీకి పిలిచారు. మేము చెప్పేది వినకుండా అవమానించారు. ప్రధాని మోదీలో అభద్రతా భావం నెలకొంది. అందుకే ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వడం లేదు. కేవలం కొందరు సీఎంలు, ప్రధాని.. చిన్నచిన్న ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిందని ప్రకటించారు. సీఎంలను తోలు బొమ్మలు అనుకుంటున్నారా? వారిని మాట్లాడనివ్వకపోవడం దురదృష్టకరం. దీన్ని మేం అవమానంగా భావిస్తున్నాం’’ అంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని సమీక్షలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, బ్లాక్ ఫంగస్ కేసుల ప్రస్తావనే లేదని విమర్శించారు. ‘‘మా రాష్ట్రంలో ఏదైనా జరిగితే.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దింపుతారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో.. గంగానదిలో శవాలు కొట్టుకొస్తున్నాయి. ఆ రాష్ట్రానికి ఎన్ని దర్యాప్తు సంస్థలు వెళ్లాయి?’’ అని ఆమె ప్రశ్నించారు. మమత ఆరోపణలపై బీజేపీ నేత, నందిగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి ఫైర్ అయ్యారు. కొన్ని నెలలుగా ప్రధాని రాష్ట్రాల సీఎంలతో ఎన్నో సమీక్షలు నిర్వహించారని, వాటిలో ఎన్నింటికి మమత హాజరయ్యారని ట్విటర్‌లో ప్రశ్నించారు. ఇది సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.