ఎన్నికల కమిషన్‌లో తక్షణ సంస్కరణలకు మమత డిమాండ్
ABN , First Publish Date - 2021-05-08T19:12:11+05:30 IST
ఎన్నికల కమిషన్‌లో తక్షణం సంస్కరణలు జరగాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌లో తక్షణం సంస్కరణలు జరగాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్ చేశారు. శాసన సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్రంలో హింసను సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో పరాజయాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఆ పార్టీ తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
మమత బెనర్జీ శనివారం శాసన సభలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌కు వెన్నెముక ఉందని, అది ఎప్పటికీ వంగబోదని చెప్పారు. చాలా కుట్ర జరిగిందని, కేంద్ర మంత్రులంతా రాష్ట్రానికి వచ్చారని అన్నారు. విమానాలు, హోటళ్ళ కోసం వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తనకు తెలియదన్నారు. మంచి నీళ్లలా డబ్బును ప్రవహింపజేశారన్నారు. తాను హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. బెంగాల్ పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ సార్వజనీనంగా జరగాలన్నారు. రూ.30,000 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఏమీ కాదన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధానంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలన్నారు.