థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర

ABN , First Publish Date - 2021-05-07T21:37:37+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌లో మూడోవేవ్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర

ముంబై: కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌లో మూడోవేవ్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అద కనుక నిజమైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా రెండో దశలో అల్లాడిపోతున్న మహారాష్ట్ర మూడో దశను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. చిన్నారుల కోసం కొవిడ్ సెంటర్లు, పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. థర్డ్ వేవ్‌ 18 ఏళ్ల లోపు వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకనే అప్రమత్తమైనట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.


చిన్నారుల కోసం కొవిడ్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి విభిన్నమైన వెంటిలేటర్ బెడ్లు, ఇతర మెడికల్ సామగ్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ సోకిన చిన్నారులు తమ తల్లులతో ఉండడం అవసరమని, వారికోసం ప్రత్యేకమైన పీడియాట్రిక్ వెంటిలేటర్లు అవసరమని మంత్రి వివరించారు. 


‘‘పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారుపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. పిల్లలకు కరోనా సోకితే వారు ఒంటరిగా ఉండలేరు. తల్లి కూడా వారితో ఉండాల్సిందే. అంతేకాదు, పిల్లలకు ప్రత్యేకమైన వెంటిలేటర్ల అవసరం ఉంటుంది కాబట్టి వాటిని సేకరిస్తున్నాం’’ అని మంత్రి తోపే తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలో జరిగిన సమావేశంలో ఈ విషయాలు చర్చించినట్టు మంత్రి పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-07T21:37:37+05:30 IST