అత్యాచారం ఆరోపణలు అబద్ధం...రిలేషన్‌షిప్‌లో ఉన్నాం

ABN , First Publish Date - 2021-01-13T15:22:41+05:30 IST

తాను 14 ఏళ్లుగా అత్యాచారం చేశానని ఓ మహిళ చేసిన ఆరోపణలను మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే ఖండించారు....

అత్యాచారం ఆరోపణలు అబద్ధం...రిలేషన్‌షిప్‌లో ఉన్నాం

మహారాష్ట్ర మంత్రి వివరణ 

ముంబై: తాను 14 ఏళ్లుగా అత్యాచారం చేశానని ఓ మహిళ చేసిన ఆరోపణలను మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే ఖండించారు. తాను సదరు మహిళతో 2003వ సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత అయిన ధనంజయ్‌ ముండే వివరణ ఇచ్చారు. మంత్రిని బావగా పేర్కొన్న ఆ 38 ఏళ్ల మహిళ తనను పెళ్లి చేసుకుంటానని, బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.కాగా మహిళతోపాటు ఆమె సోదరి కలిసి డబ్బు కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, దీనిపై తాను గత ఏడాది నవంబరు నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి చెప్పారు. మహిళతో ఉన్న రిలేషన్ షిప్ ను తన కుటుంబం కూడా అంగీకరించిందని, ఆమె ద్వారా తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని మంత్రి వివరించారు.


 మహిళతో తనకు సంబంధం ఉందని మంత్రి ముండే అంగీకరించినా మంత్రివర్గం నుంచి అతన్ని తొలగించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బీజేపీ మహిళా విభాగం లేఖలో కోరింది.  ‘‘ 2008లో తాను ఒంటరిగా ఇంట్లో ఉండగా మంత్రి ముండే నాపై మొదటిసారి అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. తీసిన అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి నాపై పలు సార్లు అత్యాచారం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోనని 2019లో ముండే చెప్పాడు’’ అని మహిళ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులు ఈ కేసును నమోదు చేయలేదు. దీంతో తాము కోర్టు ద్వారా ఫిర్యాదు చేస్తామని మహిళ తరపున న్యాయవాది రమేష్ త్రిపాఠి చెప్పారు. మంత్రి ముండే వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని,తనను పోలీసులు కాపాడాలని బాధిత మహిళ కోరింది. 

Updated Date - 2021-01-13T15:22:41+05:30 IST