మరాఠా రిజర్వేషన్‌పై సుప్రీం తీర్పు.. మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2021-05-08T23:51:51+05:30 IST

మరాఠా రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాయాలన...

మరాఠా రిజర్వేషన్‌పై సుప్రీం తీర్పు.. మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం..

ముంబై: మరాఠా రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాయాలని మహారాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మరాఠా రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విశ్లేషించేందుకు ఓ కమిటీ వేయాలని కూడా నిర్ణయించారు. 15 రోజుల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కూడా యోచిస్తున్నట్టు మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ వెల్లడించారు. మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ ముంబైలో సమావేశం అయ్యింది. ఈ భేటీలో మంత్రులు అశోక్ చవాన్, ఏక్‌నాథ్ షిండే, దిలీప్ వాల్సే పాటిల్, చీఫ్ సెక్రటరీ సీతారాం కుంతే, అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభ్‌కోనీ సహా మరికొంత మంది అధికారులు హాజరయ్యారు. మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని సర్వోన్నత ధర్మాసనం ప్రకటించింది.  మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు 50 శాతం పరిమితిని దాటాల్సిన అవసరం లేదని సుప్రీం ఈ సందర్భంగా పేర్కొంది. 

Updated Date - 2021-05-08T23:51:51+05:30 IST