జనాభాను నియంత్రిస్తే లోక్సభ సీట్లు తగ్గిస్తారా?
ABN , First Publish Date - 2021-08-23T06:38:29+05:30 IST
జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక తగిన ద్రవ్య పరిహారం చెల్లిస్తారో స్పష్టం...
- కేంద్ర ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
- నియోజకవర్గాల పునర్విభజనలో
- ఉమ్మడి ఏపీ, తమిళనాడుకు అన్యాయం
- పాత స్థానాలు పునరుద్ధరిస్తారా?
- రాజ్యసభ సీట్లు పెంచుతారా?
- లేక ఆర్థిక పరిహారం చెల్లిస్తారా?
- ఆ లెక్కన తమిళనాడు రాష్ట్రానికి
- 5,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి
- 1967లోనూ దక్షిణాది రాష్ట్రాలు
- కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది
- 4 వారాల్లో కౌంటర్ దాఖలుచేయండి
- కేంద్రప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
1967లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలు కొన్ని లోక్సభ స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జనాభా నియంత్రణే దీనికి కారణం. ఆ తర్వాత చేపట్టే పునర్వ్యవస్థీకరణలో ఆ రాష్ట్రాలు మరిన్ని లోక్సభ స్థానాలు కోల్పోయే ప్రమాదం రావడంతో.. పునర్విభజనపై 2001 దాకా నిషేధం విధించారు. అయితే వాజపేయి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టినప్పుడు.. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకుండా.. కొన్ని జనరల్ స్థానాలను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించి.. వారి ప్రాతినిధ్యం మాత్రమే పెంచింది. స్థానాల సంఖ్య పెంపును మాత్రం 2026కి వాయిదావేసింది.
మద్రాసు హైకోర్టు
చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక తగిన ద్రవ్య పరిహారం చెల్లిస్తారో స్పష్టం చేయాలని జస్టిస్ ఎస్.కృపాకరన్, జస్టిస్ పి.పుగళేందితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది(జస్టిస్ కృపాకరన్ ఇటీవలే పదవీవిరమణ చేశారు). 1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520కి పెరిగింది. అయితే సభలో తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి. (1977లో 42కి పెరిగాయి).
పునర్వ్యవస్థీకరించిన సీట్లతో 1967లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లోక్సభలో రెండేసి స్థానాలను కోల్పోయాయని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. జన నియంత్రణ కార్యక్రమాలను సరిగా అమలు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదని అడిగింది. 1967 నుంచి రూ.400 కోట్లు. ఆ లెక్కన 14 ఎన్నికలకు 28 స్థానాలు కోల్పోయినందున తమిళనాడుకు రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది’ అని తెలిపింది.
జనాభా మార్పుతో సంబంధం లేకుండా అదే సంఖ్యలో లోక్సభ నియోజకవర్గాలను ప్రకటించేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడానికి వీలుందో లేదో కేంద్రం పరిశీలించాలని, నాలుగు వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తమిళనాడులోని తెన్కాశి రిజర్వుడు నియోజవర్గాన్ని జనరల్ కేటగిరీ నియోజకవర్గంగా మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చుతూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కొత్త పార్లమెంటు భవనంలో లోక్సభలో 1,000 సీట్లు ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలో లోక్సభలో కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న డిమాండ్ వస్తోంది.
తదుపరి పునర్విభజన 2026లో!
స్వతంత్ర భారతంలో నియోజకవర్గాల తొలి పునర్విభజన 1956లో జరిగింది. ఆ తర్వాత పంజాబ్ నుంచి హరియాణా విడిపోవడం, గోవా భారత్లో విలీనం కావడం వంటి పరిణామాల కారణంగా 1967లో మళ్లీ పునర్విభజన చేపట్టారు. లోక్సభ స్థానాల సంఖ్యను 520కి పెంచుతూ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. అయితే జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గిపోయింది. తర్వాతి పునర్వ్యవస్థీకరణలో ఈ రాష్ట్రాల సీట్లలో మరింత కోత పడబోతోందని వార్తలు రావడంతో.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 2001 వరకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించకుండా నిషేధం విధించారు. అయితే అడపాదడపా పునర్విభజన చేపడుతూనే వచ్చారు. 1977, 80, 84ల్లో లోక్సభ సంఖ్యాబలం 542గా ఉంది. 1989నాటికి 543కి పెరిగింది. అప్పటి నుంచి అదే కొనసాగుతూ వస్తోంది. 2001లో పునర్విభజన జరిగినా.. సీట్ల సంఖ్యను పెంచలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా జనరల్ స్థానాలను రిజర్వుడు కేటగిరీలోకి మార్చారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపును మాత్రం 2026కి వాయిదావేశారు. అప్పటికల్లా జనాభా వృద్ధి రేటులో అన్ని రాష్ట్రాలూ ఏకరూపత సాధిస్తాయని అంచనా వేశారు.
‘జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఏపీ లోక్సభలో రెండేసి స్థానాలను కోల్పోయాయి. జనాభా నియంత్రణను సరిగ్గా చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారు? ఈ రెండు రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదు’?
మద్రాసు హైకోర్టు