కొవిడ్-19తో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

ABN , First Publish Date - 2021-05-03T04:24:49+05:30 IST

కొవిడ్-19 కారణంగా మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి...

కొవిడ్-19తో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

భోపాల్: కొవిడ్-19 కారణంగా మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ ఇవాళ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. తికంగఢ్ జిల్లా పృథ్విపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇవాళ సాయంత్రం గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ వెల్లడించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో గతవారం హుటాహుటిన ఝాన్సీ నుంచి భోపాల్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రాథోడ్ పరిస్థితి విషమించిందని సింగ్ వెల్లడించారు. కాగా రాథోడ్ మృతిపట్ల మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాథోడ్ నిజమైన ప్రజాసేవకుడనీ... ఆరోగ్యకరమైన, నీతిమంతమైన రాజకీయాలను ఇష్టపడేవారని సీఎం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ సైతం రాథోడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాథోడ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి. పార్టీ కోసం అత్యంత అంకితభావంతో పనిచేశారు. ఆయన మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు..’’ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-03T04:24:49+05:30 IST