ఆరో రోజూ లోక్‌సభ వాయిదా

ABN , First Publish Date - 2021-02-06T07:32:20+05:30 IST

సాగు చట్టాలపై చర్చను డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు ఆరో రోజూ లోక్‌సభను స్తంభింపజేశాయి. ప్రశ్నోత్తరాల సమయం 15 నిమిషాలు సాగడం,

ఆరో రోజూ లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : సాగు చట్టాలపై చర్చను డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు ఆరో రోజూ లోక్‌సభను స్తంభింపజేశాయి. ప్రశ్నోత్తరాల సమయం 15 నిమిషాలు సాగడం, మంత్రులు తమ కాగితాలను ప్రవేశపెట్టడం మినహా కార్యకలాపాలేవీ సాగలేదు. స్పీకర్‌ ఓం బిర్లా సభను అయిదు సార్లు వాయిదా వేసి చివరకు సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌పై చర్చల తర్వాత సమయం ఉంటే రైతుల సమస్యలపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రతిపక్షాలు వినిపించుకోలేదు.


ప్రతిష్టంభనను తొలగించే విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ పార్లమెంట్‌లో కీలక చర్చలు జరిపారు. ప్రతిపక్షాలు ఒప్పుకోకపోతే గందరగోళం మధ్యే బడ్జెట్‌ను ఆమోదించి సభను వాయిదా వేయడం మంచిదని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. 

Updated Date - 2021-02-06T07:32:20+05:30 IST