ఐఎస్‌ను వేటాడతాం!
ABN , First Publish Date - 2021-08-28T08:34:17+05:30 IST
.. నిర్వేదంతో కూడిన ఆయన ముఖంలో ఆగ్రహంతో కూడిన జేవురింపు. మౌనం వీడి పొడి పొడిగా పెగలిన మాటలు గద్గద స్వరం నుంచే ఘాటైన హెచ్చరికలు...
సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటనను మరిచిపోం
కాబూల్ ఉగ్రదాడికి పాల్పడ్డవారిని అస్సలు క్షమించం
ఘటనకు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం
ప్రణాళిక రచన కోసం సైన్యానికి ఆదేశాలు
ఆ సైనికులు హీరోలు.. జాతీయ పతాకం అవనతం
ఉగ్రదాడిలో తాలిబన్ల పాత్రపై ఇప్పటికైతే ఆధారాల్లేవ్
సైన్యం ఉపసంహరణ తర్వాతా ప్రజల్ని తరలిస్తాం: బైడెన్
వాషింగ్టన్, ఆగస్టు 27: నిర్వేదంతో కూడిన ఆయన ముఖంలో ఆగ్రహంతో కూడిన జేవురింపు. మౌనం వీడి పొడి పొడిగా పెగలిన మాటలు.. గద్గద స్వరం నుంచే ఘాటైన హెచ్చరికలు! శుక్రవారం వైట్‌హౌ్‌సలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖంలో ఎన్నో భావోద్వేగాలు ప్రస్పుటమయ్యాయి. తమ సైనికుల ఉసురు తీసిన ఐఎస్ ఉగ్రమూకపై ప్రతీకారం తీర్చుకుంటాం అని స్పష్టం చేశారు. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం సంభవించిన ఆత్మాహుతి దాడిలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మృతిచెందగా, ఆ దేశానికి చెందిన మరో 18 మంది సైనికులు గాయపడ్డారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులనే అనుమానాలు వ్యక్తమవుతుండగానే, తామే బాధ్యులమంటూ ఆ ఉగ్రమూక ప్రకటించుకుంది. తమ సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను వెంటాడి వేటాడి, మూల్యం చెల్లించుకునేలా చేస్తాం అని బైడెన్ ప్రతినబూనారు. ‘‘ఈ ఘాతుకాన్ని మేం మరిచిపోం. ఘాతుకానికి పాల్పడ్డ వారిని క్షమించం. తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఐఎ్‌స-కే ఆగడాలు ఇక సాగవని.. ఆ సంస్థ నేతల పీచమణచేలా.. ఆ సంస్థ ఆస్తులు, వారికి లభిస్తున్న సౌకర్యాలన్నీ స్తంభించిపోయేలా ఆపరేషన్‌కు ప్రణాళికను అభివృద్ధి చేయాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులను ఆయన హీరోలుగా అభివర్ణించారు. వారికి సంతాప సూచకంగా అమెరికా అంతటా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించారు. అఫ్గాన్‌లో తమ సైనికుల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా తరలింపు ప్రక్రియ ఉంటుందని ఆయన చెప్పారు. తాలిబన్లను నమ్మలేం అని చెబుతూనే ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. కాగా, కాబూల్‌లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని బైడెన్‌కు ఆయన జాతీయ భద్రతా బృందం తెలిపింది. ఐఎస్ ఉగ్రవాదులు బాంబులతో విమానమెక్కే అవకాశాలున్నాయని, అందుకే లోపలికి ప్రవేశించే వారిని నఖశిఖపర్యంతం పరిశీలించాలని అమెరికా సెంట్రల్ కమాండ్ అధినేత జనరల్ కెన్నిత్ మెకెంజీ చెప్పారు.